Twitter Bird: ‘ట్విట్టర్ బర్డ్’ను ఫ్రై చేసిన పర్యావసానం.. మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు పార్టీ నుంచి ప్యాక్!
మాజీ పార్లమెంటు సభ్యులు హర్షకుమార్ కుమారుడు జివి శ్రీరాజ్‌ను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన అధిష్టానం. సస్పెన్షన్‌కు గల కారణాలను లేఖ ద్వారా వివరించింది.
GV Sriraj Suspended from Congress: మాజీ పార్లమెంటు సభ్యులు హర్షకుమార్ కుమారుడు జివి శ్రీరాజ్‌ను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన అధిష్టానం. సస్పెన్షన్‌కు గల కారణాలను లేఖ ద్వారా వివరించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు.. ఇటీవల శ్రీరాజ్ బృందం చేసిన చర్యలు పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయన్నారు. అందుకే వేటు వేయక తప్పలేదన్నారు.
మహాత్మాగాంధీ కాలం నుండి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ విలువలను పాటిస్తూనే ఉందని, కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరినవారు, పార్టీ ప్రతిష్టను దిగజార్చారని ఈశ్వరరావు ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ పేరును అగౌరవ పరిచారు అందుకే సస్పెన్షన్ వేటు వేశామని తెలిపారు. పార్టీలో ఏ వ్యక్తి అయినా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలన్నారు. శ్రీరాజ్ చేసిన చర్య ప్రజలలో తీవ్ర ఆగ్రహం కలిగించిందన్నారు. వారి చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎవరు చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఉపేక్షించేదీలేదన్నారు ఈశ్వరరావు. కాగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ – కమ్యూనికేషన్ విభాగం ప్రత్యేక ఆదేశాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మిమ్మల్ని తక్షణమే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది.
ఇదిలావుంటే, సామాజిక మాధ్యమం ‘ట్విటర్’ మీద ఉన్న కోపాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జీవీ శ్రీరాజ్ ఓ పక్షిపై చూయించారు. ఆ పక్షిని బలి తీసి ఉప్పుకారం మసాలాలు దట్టించి సలసల మాగే నూనెలో వేయించారు. అనంతరం ఆ మాంసాన్ని ట్విటర్ ప్రధాన కార్యాలయానికి పోస్టు చేశారు. ఇదంతా చేసింది రాహుల్ ఖాతాను ట్విటర్ నిలిపివేయడానికి నిరసనగా చేసిన ఈ కార్యక్రమం వైరల్‌గా మారింది. ఈ ఘటనను పలువురు ఖండిస్తుంటే.. మరికొందరు హర్షిస్తున్నారు. రాహుల్‌గాంధీ ఖాతాను ట్విటర్ నిషేధించిన అనంతరం పునరుద్ధరించింది. వరుసగా ఇదే పరిస్థితి ఏర్పడడంతో ఏపీకి చెందిన జీవీ శ్రీరాజ్ ట్విటర్ లోగోలో ఉండే పక్షి పిచ్చుకను కాల్చేశారు.