AP Crop Insurance Money: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత ఖాతాల్లో బీమా సొమ్ము జమ చేయనున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది. కరోనా కష్టకాంలోనూ రైతులకు అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ నేరుగా రైతుల ఖాతాలోకి బీమా సొమ్మును జమ చేయనున్నారు

AP Crop Insurance Money: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత ఖాతాల్లో బీమా సొమ్ము జమ చేయనున్న సీఎం జగన్
Ap Cm Ys Jagan
Follow us

|

Updated on: May 25, 2021 | 10:04 AM

AP CM Jagan release crop insurance money: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది. కరోనా కష్టకాంలోనూ రైతులకు అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ నేరుగా రైతుల ఖాతాలోకి బీమా సొమ్మును జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు బీమా సొమ్మును మఖ్యమంత్రి అర్హులైన వారి ఖాతాలో వేయనున్నారు. వరుస తుఫానులు.. అకాల వర్షాలు.. ఇలా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన అన్నదాత‌ల‌కు వైఎస్ఆర్ పంటల బీమా కింద పరిహారాన్ని జ‌గ‌న్ స‌ర్కార్ ఇవాళ చెల్లించనుంది. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్‌–2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్లు జమ చేయనుంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

దేశవ్యాప్తంగా మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో కేవలం నోటిఫైడ్‌ పంటలకు.. ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే బీమా వర్తింపచేసేవారు. దీంతో ఆర్థిక స్తోమత, అవగాహన లేక లక్షలాది మంది రైతులు బీమా చేయించుకోలేక ఆర్థికంగా నష్టపోయేవారు. ఒకప్పుడు బీమా సొమ్ములు ఎప్పుడొస్తాయో.. ఎంతొస్తాయో, ఎంతమందికి వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది. ఈ దుస్థితికి చెక్‌ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై పైసా భారం పడనీయకుండా.. తానే భారాన్ని భరిస్తూ ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఏడాది తిరగకుండానే సమయానికి రైతులకు పంటల బీమా సొమ్ములు చెల్లించాలన్న లక్ష్యంతో ఖరీఫ్‌–2019 సీజన్‌కు సంబంధించి 9.79 లక్షల మంది రైతులకు రూ.1,252.18 కోట్లు చెల్లించింది.

ఖరీఫ్‌–2020 సీజన్‌లో 37.25 లక్షల మంది రైతులు 35.75 లక్షల హెక్టార్లలో వేసిన పంటలు బీమా పరిధిలోకి వచ్చాయి. దిగుబడి ఆధారంగా 21 పంటలకు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా 9 పంటలకు బీమా సదుపాయం కల్పించారు. పంటకోత ప్రయోగాల ఆధారంగా అర్హత పొందిన 15.15 లక్షల మంది రైతులకు రూ.1,820.23 కోట్లు బీమా సొమ్మును వారి ఖాతాల్లో ఇవాళ జమ చేస్తున్నారు. ఈ మొత్తంతో కలిపి గత రెండేళ్లలో పంటల బీమా కింద 30.52 లక్షల మంది రైతులకు రూ.3,788.25 కోట్ల లబ్ధిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేకూర్చింది. ఇలా ఇప్పటివరకు రైతులు వివిధ పథకాల కింద గత రెండేళ్లలో రూ.83,085.45 కోట్ల లబ్ధిని పొందారు.

ముఖ్యంగా రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. 5.58 లక్షల మంది రైతులకు గత టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ.716 కోట్ల బకాయిలను కూడా చెల్లించామని ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. రాష్ట్రంలో కరోనా భయం వెంటాడుతున్నా.. ఆర్థిక కష్టాలు కొనసాగుతున్నా.. ఖరీఫ్‌–2020 పంటల బీమా సొమ్ము జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో ఎన్నడూ ఏడాది తిరగకుండానే బీమా పరిహారం చెల్లించిన దాఖలాలు లేవు. కోవిడ్‌ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతుభరోసా కేంద్రాల ద్వారా అర్హులైన రైతులను గుర్తించి.. వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని కన్నబాబు తెలిపారు.

డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం అమలు కింద 21 రకాల పంటలకు బీమా కల్పించామని, వాతావరణం ఆధారంగా 9 రకాల పంటలకు సంబంధించి 35.75లక్షల హెక్టార్లకు బీమా కల్పించినట్లు వెల్ల‌డించారు. ప్రభుత్వ వాటాతో పాటు వీరు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. నోటిఫైడ్‌ చేసిన పంటల సాగుదారుల వివరాలను ‘ఈ పంట’ ద్వారా నమోదు చేస్తామన్నారు. మీకు అన్ని అర్హతలు ఉన్నా డబ్బులు జమ కాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. లబ్ధిదారుల సందేహాలు తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోల్‌ఫ్రీ నెంబర్ ప్రారంభించింది. వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు రాకపోతే లబ్ధిదారులు 155251 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. తమకు డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు.

Read Also… Yaas Cyclone: వాయువేగంతో దూసుకువస్తున్న యాస్ తుఫాన్.. ప్రభావిత ప్రాంతాల్లో టెన్షన్.. టెన్షన్