CM Jagan: ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో ఈ పవర్ ప్రాజెక్టును ఏర్పాటుచేయనున్నారు. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ పవర్ ప్రాజెక్టు ప్రత్యేకత. దీని ద్వారా 5,230 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ పవర్ ప్రాజెక్టు కు అంకురార్పణ చేసిన జగన్.. అంతకు ముందు అక్కడ ఏర్పాటు చేసిన ఓ పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు.అనంతరం పవర్ ప్రాజెక్ట్ త్రీడీ మోడల్ నమూనాను పరిశీలించారు. ‘ ఈ ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక పవర్ ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని నిరుద్యోగులకు భారీగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రానున్నాయి. హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే సుమారు 15 వేల ఉద్యోగాలొస్తాయి. ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఆ తరువాత ప్రత్యక్షంగా 3 వేల మందికి.. పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాజెక్టు రానున్న రోజుల్లో యావత్ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుంది.శిలాజ ఇంధనాల వినియోగాన్ని వదిలిపెట్టి, పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన నిల్వ యూనిట్‌ను ఏర్పాటు చేసినందుకు గ్రీన్‌కో గ్రూప్‌కు అభినందనలు’ అని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఐదేళ్లలో పూర్తయ్యేలా..
కాగా గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తోన్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే 2,800 ఎకరాలను సేకరించి సంస్థకు అప్పగించింది. ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక పవర్ ప్రాజెక్టులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి, 550 మెగావాట్ల విండ్ పవర్, 1, 860 మెగావాట్ల హైడల్ పవర్‌ను ఉత్పత్తి చేయనున్నారు. కాగా ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 5,410 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నేషనల్ గ్రిడ్‌కు అనుసంధానించి ఓరక్వల్లు పీజీసీఐఎల్ విద్యుత్ సబ్ స్టేషన్ ద్వారా దేశంలోని డిస్కమ్‌లు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోనుననారు. రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు, కలెక్టర్ పి.కోటేశ్వరరావు, కర్నూలు రేంజ్ డీఐజీ ఎస్.సెంథిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: