Jagananna Vidya Deevena: తల్లి ఖాతాలో ‘విద్యా దీవెన’ జమ చేసిన సీఎం జగన్.. వారి నుంచి డాక్టర్లు, కలెక్టర్లు రావాలంటూ..

Jagananna Vidya Deevena: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విద్యాదీవెన పథకానికి సంబంధించి నిధులను ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. ఈ మేరకు 2023 మార్చి త్రైమాసికానికి సంబంధించిన 703 కోట్ల రూపాయల నిధులను బటన్‌ నొక్కి 9.95 లక్షల మంది..

Jagananna Vidya Deevena: తల్లి ఖాతాలో ‘విద్యా దీవెన’ జమ చేసిన సీఎం జగన్.. వారి నుంచి డాక్టర్లు, కలెక్టర్లు రావాలంటూ..
Jagananna Vidya Deevena
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 24, 2023 | 12:52 PM

Jagananna Vidya Deevena: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విద్యాదీవెన పథకానికి సంబంధించి నిధులను ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. ఈ మేరకు 2023 మార్చి త్రైమాసికానికి సంబంధించిన 703 కోట్ల రూపాయల నిధులను బటన్‌ నొక్కి 9.95 లక్షల మంది విద్యార్థుల తల్లి ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. భావి తరాల పిల్లల తలరాతలు మార్చేందుకే ఈ విద్యా దివెన ఖర్చు అని, ఇవే మానవ వనరులమీద పెట్టుబడులు అని చెప్పుకొచ్చారు. ఇంకా రానున్న రోజుల్లో దేశానికి దశ, దిశ ఆంధ్రప్రదేశ్ చూపిస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఏ రాష్ట్రంలో లేని విధంగా నర్సరీ నుంచి, ఉన్నత విద్యవరకూ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని అన్నారు.

సీఎం జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘మన సమాజంలో పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆ కుటుంబాల తలరాతలు మారాలి. వారు పేదరికం నుంచి బయటకు రావాలి. ఆ కుటుంబాల నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు లాంటి వారు తప్పక రావాలి. పేదరికం అనే సంకెళ్లను వారు తెంచుకోవాలి. అయితే దానికి చదువు ఒక్కటే మార్గం. అందుకే నాలుగేళ్ల మా ప్రభుత్వ పాలనలో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ వాడిగా అడుగులేశాం. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు సామాజికంగాను, ఆర్థికంగానూ గట్టిగా నిలబడాలంటే, వారు వివక్ష సంకెళ్లను తెంచుకోవాలంటే.. దానికి చదువులు ఒక్కటే మార్గం. ఒక అంబేద్కర్‌, ఒక సావిత్రీ పూలే కాని, మౌలానా అబ్దుల్‌ ఆజాద్‌ కాని వారి నోట్లోనుంచి వచ్చిన మాట ఏంటంటే.. చదువు అనేది ఒక్క అస్త్రం అని. అలాంటి చదువుల విప్లవం మన రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలుగా చేపట్టాం. చదువులు అన్నవి పేదలకు ఒక హక్కుగా అందాలి’ అని పేర్కొన్నారు.

అలాగే మా ప్రభుత్వం ఉన్నత విద్యలు కొనసాగించాలనుకునేవారికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలను అమలు చేస్తోందని, పూర్తి ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి త్రైమాసికంలోనూ జమచేస్తున్నామని పేర్కొన్నారు సీఎం జగన్. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో అరకొరగా ఫీజులు చెల్లించారని టీడీపీపై ఎద్దేవా చేశారు. చంద్రబాబు రూ. 1777 కోట్ల రూపాయలు బకాయిపెట్టాడని, ఆడబ్బును కూడా మన ప్రభుత్వమే తీర్చిందని, బోర్డింగ్‌ ఫీజులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందని, ప్రతి ఏటా వసతి దీవెన కింద రెండు మార్లు తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నామన్నారు. అలాగే అక్షరాల 25 లక్షల మందికిపైగా విద్యార్థులకు ఈ పథకం వర్తింపు చేస్తున్నామని, కేవలం ఒక్క ఈ పథకానికే రూ.4,275.76 ఖర్చుచేశామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..