Chandrababu: ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులతో వరుస భేటీలు.. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యల వివరణ

అధికారం చేపట్టిన తర్వాత చేపట్టిన తొలి హస్తిన మిషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులతో వరస భేటీ అయ్యారు. ఏపీకి అండగా నిలవాల్సిన అవసరాన్ని వివరించారు.

Chandrababu: ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులతో వరుస భేటీలు.. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యల వివరణ
Chandrababu Delhi Tour
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 05, 2024 | 7:52 PM

అధికారం చేపట్టిన తర్వాత చేపట్టిన తొలి హస్తిన మిషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులతో వరస భేటీ అయ్యారు. ఏపీకి అండగా నిలవాల్సిన అవసరాన్ని వివరించారు. హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు.. రేపటి బిగ్‌మీట్‌పై ఫోకస్‌ పెట్టారు. ఇంతకూ 2 స్టేట్స్‌ ఫేస్‌ టు ఫేస్‌లో చర్చించబోయే అంశాలేంటి..? పదేళ్లుగా పరిష్కారం కాని అంశాలు..ముఖ్యమంత్రుల భేటీతో కొలిక్కి వస్తాయా..? రెండు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది.

ఢిల్లీ పర్యటనను సక్సెస్‌ఫుల్‌గా ముగించారు..ఏపీ సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన టీడీపీ అధినేతకు..పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీ పర్యటన చేపట్టిన చంద్రబాబు..ఈ పర్యటనలో ప్రధాని మోదీ తోపాటు పలువురు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆర్థిక సుడిగుండంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ప్రధానిని కోరారు. 2014లో రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం వల్ల ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలు..దానికితోడు గత ఐదేళ్ల పాలన వల్ల తలెత్తిన ఇబ్బందులను మోదీకి వివరించారు. పోలవరం ప్రాజెక్టు, ఇతర జలవనరులు, రహదారులు, రాజధాని నిర్మాణాలను గత ప్రభుత్వం విస్మరించడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడటం కష్టమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

అప్పుల భారంలో ఉన్న ఏపీని ఆదుకోవాలని విజ్ఞప్తి

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు అమిత్‌ షా, పీయూష్‌ గోయల్, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్, మనోహర్‌లాల్‌ ఖట్టర్, హర్‌దీప్‌సింగ్‌ పురి, నిర్మలా సీతారామన్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు..చంద్రబాబు. అలాగే 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియాలతోనూ పలు అంశాలపై చర్చించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీలో..అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని అలాగే పలు ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని వివరించారు. పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించాలని కోరారు. సీఎం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి..వీలైనంతవరకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రాభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులు, నిధులు, కేటాయింపులు

టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం, అమరావతి ప్రాజెక్టుల భవితవ్యం.. కేంద్రం అందించే సహకారం పైనే ఆధారపడి ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమరావతిలో త్వరితగతిన ఏర్పాటు చేసేలా కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలంటే 70 వేల కోట్లు అవసరం అవుతాయని శ్వేతపత్రంలో చూపించారు. ఆలస్యం కారణంగా ప్రాజెక్ట్ వ్యయం 36 శాతం పెరిగిందన్నారు సీఎం చంద్రబాబు. వీటితో పాటు రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులు, నిధులు, కేటాయింపులు అవసరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు జరపాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జర్నలిస్ట్‌లతో చిట్‌చాట్‌ నిర్వహించిన చంద్రబాబు.. కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదని.. తమకు ఇచ్చిన 2 మంత్రి పదవులే తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర పునర్‌నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. దక్షిణాదిలో ఎక్కడా లేని వనరులు ఏపీలో ఉన్నాయని.. నదుల అనుసంధానంతో అద్భుతాలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రజా భవన్‌ వేదికగా ఇద్దరు సీఎంల భేటీ

మరోవైపు ప్రజాభవన్‌లో జరగనున్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీకి.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6గంటలకు ప్రజాభవన్‌లో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి సమావేశమవుతారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటి సారి. కృష్ణా జలాల పంపిణీ, కోర్టుల్లో ఉన్న పిటిషన్లను వెనక్కి తీసుకోవడం, భద్రాచలం మండలంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడం, పలు ఉమ్మడి సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీలో నెలకొన్న ప్రతిష్టంభన, రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన..వంటి ఆంశాలపై సీఎంల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా షెడ్యూల్‌ 9, షెడ్యూల్‌ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించనున్నారు.

ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై షీలాబేడీ కమిటీ

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్‌ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలోని ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్‌ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబేడీ కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్‌లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్‌ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. ఈ సమస్యలకు ముఖ్యమంత్రుల భేటీలో పరిష్కారం లభించే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..