తిరుమల తిరుపతి, ఆగస్టు 14: తిరుమల అలిపిరి మార్గంలో 7వ మైలు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లాకు చెందిన చిన్నారి లక్షితను చిరుత బలితీసుకుంది. దీంతో అలర్టయిన తిరుమల తిరుపతి దేవస్థానం.. సిబ్బందిని మోహరించి పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా మెట్ల మార్గంలో ఆంక్షలను కూడా విధించింది. అంతేకాకుండా చిరుతను పట్టుకోవాలని బోన్లను సైతం ఏర్పాటు చేసింది. చిన్నారిని బలితీసుకున్న స్పాట్‌తో పాటు మరోచోట బోను ఏర్పాటు చేసింది. తిరుమల అలిపిరి మార్గంలో మళ్లీ హై టెన్షన్ నెలకొంది. రెండు రోజుల నుంచి చిరుత జాడ కోసం సెర్చ్ చేస్తుండగా.. చిరుత చిన్నారిని బలితీసుకున్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనుకు చిక్కింది. దీంతో టీటీడీతోపాటు ఫారెస్ట్ అధికారులు, భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఇంకా శేషాచలం అడవుల్లో మరికొన్ని చిరుతలు సంచరిస్తున్నాయని.. వాటిని కూడా పట్టుకోవాలనుకుంటున్న క్రమంలో.. మెట్ల మార్గం సమీపంలో మరోసారి అలజడి మొదలైంది. తిరుమలకొండ నామాలగవి ప్రాంతంలో మరో చిరుత సంచరిస్తూ భక్తుల కంట పడింది. చిరుతను చూసిన భక్తులు భయంతో పరుగు తీశారు. ఇది కనిపించిన మరికాసేపటికే.. మెట్లమార్గంలో ఎలుగుబంటి కూడా కనిపించడం కలకలం రేపింది.
ఓ చిరుత చిక్కిందని ఊపిరి తీసుకునేలోపే.. చిరుతతోపాటు.. ఎలుగుబంటి ప్రత్యక్షం కావడంతో తిరుమలలో ఆందోళన నెలకొంది. చిరుత, ఎలుగుబంటిని చూసిన భక్తులు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారుల బృందం వెంటనే.. చిరుత, ఎలుగుబంటి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నాయి. తిరుమల నడకదారుల్లో వరుస ఘటనలతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.
కాగా, తిరుమల మెట్ల మార్గం పరిసరాల్లో మొత్తం మూడు చిరుతలు సంచరిస్తున్నాయని టీటీడీ వెల్లడించింది. వాటిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు, టీటీడీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల మెట్ల మార్గంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని భక్తులందరూ సహకరించాలని కోరారు. చిరుతలను పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నామని.. ఫారెస్ట్ అధికారులకు సహకరిస్తామని టీటీడీ వెల్లడించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..