
కృషి పట్టుదల ఉంటే ఎక్కడి నుంచి వచ్చామనేది కాకుండా లక్ష్యం సాధించాలన్న పట్టుదలే మనిషిని ముందుకు నడిపిస్తుందనేది మరోసారి రుజువైంది. బాపట్లజిల్లా గవినివారిపాలెం గ్రామానికి చెందిన ఓ యువకుడు దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన సంస్థలో శాస్త్రవేత్తగా ఎంపిక కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాపట్లజిల్లా చీరాల మండలం గవినివారిపాలెం గ్రామానికి చెందిన యువకుడు నక్కల సాంబశివరావు (23) అతి చిన్న వయసులో అణు శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. భారత ప్రభుత్వ సంస్థ బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) శాస్త్రవేత్తగా నియమించబడ్డాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన సాంబశివరావు తండ్రి నాగరాజు ఒక సామాన్య రైతు. సాంబశివరావు చిన్ననాటి నుంచి కష్టపడి చదువుకున్నారు.
టెన్త్ వరకు బాపట్లలో చదివిన సాంబశివరావు ఇంటర్ నాగార్జునసాగర్‌లో పూర్తి చేశారు. బీటెక్ విజయవాడలోని ఓ ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేశారు. బీటెక్ పూర్తయిన వెంటనే గేట్, సీబీటీ పరీక్షలు రాసి దేశ వ్యాప్తంగా 289 ర్యాంకు సాధించారు. అనంతరం బార్క్ నిర్వహించిన ముఖాముఖిలో గ్రూప్ ఏ క్యాడర్లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల అనంతరం ప్రస్తుతం 10 నెలలుగా శిక్షణలో ఉన్నారు.
శిక్షణ పూర్తయిన తరువాత పూర్తిస్థాయి శాస్త్రవేత్తగా విధులు నిర్వహించనున్నారు. విశేషం ఏంటంటే సాంబశివరావు తాను ఎంచుకున్న లక్ష్యం కోసం ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. ఫోన్ ద్వారా ఇంటర్ నెట్‌ను సక్రమంగా ఉపయోగించుకుంటూ తనకు కావాల్సిన సమాచారాన్ని నెట్టింట్లోనుంచి నేర్చుకుంటూ కృషి పట్టుదలతో తెలివి తేటలకు పదును పెట్టుకున్నాడు. ప్రస్తుతం శిక్షణ తర్వాత బార్క్ సంస్థ తన శాఖల్లో పోస్టింగ్ కోసం మరో పరీక్ష నిర్వహించనుంది. ఇందులో వచ్చే ర్యాంకు ఆధారంగా బార్క్ శాఖలలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..