Andhra Pradesh: దారుణం..! ఆలస్యంగా వచ్చారనీ మండుటెండలో నిలబెట్టి.. విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ప్రిన్సిపల్
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కేజీబీవీ పాఠశాల విద్యార్ధినుల పట్ల ప్రిన్సిపల్ దారుణంగా వ్యవహరించింది. క్రమశికణ పేరుతో అవమానకరంగా ప్రవర్తించింది. ఆలస్యంగా వచ్చారన్న కారణంతో 18 మంది విద్యార్ధినుల జుత్తు కత్తిరించి అమానవీయంగా హింసించింది..
జి.మాడుగుల, నవంబర్ 18: క్రమశిక్షణ పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ పాఠశాల యాజమన్యం అమానవీయ ఘటనకు పాల్పడింది. పాఠశాలలో ఉదయం ప్రతిజ్ఞ సమయానికి రాలేదని బాలికల జుత్తును ప్రిన్సిపల్ కత్తిరించింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలోని కస్తూర్బా బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో వెలుగు చూసింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల జుత్తును ప్రిన్సిపాల్ కత్తిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులు తెలిపిన కథనం ప్రకారం..
నవంబర్ 15న (శుక్రవారం) కార్తీక పౌర్ణమి పండగ రోజున ఉదయం స్నానాలకు నీళ్లు అందుబాటులో లేవు. దీంతో పాఠశాలలో ఇంటర్ బైపీసీ రెండో ఏడాది చదువుతున్న కొందరు విద్యార్థులు ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యంగా హాజరయ్యారు. మొత్తం 23 మంది విద్యార్ధినులు రాలేదని గుర్తించిన ప్రిన్సిపల్ సాయిప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో విద్యార్థినులను పాఠశాల ఆవరణలో ఎండలో 2 గంటలు సేపు నిలబెట్టింది. వారిలో ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. నలుగురు విద్యార్థినులపై చేయిచేసుకుంది కూడా. మధ్యాహ్న భోజన విరామంలో వీరిలో 18 మందికి జట్టును ఇష్టానుసారంగా కత్తిరించింది. వీరిలో ఓ విద్యార్థిని దేవుని మొక్కు ఉందని జుత్తు కటింగ్ చేయవద్దని ప్రాథేయపడినా ప్రిన్సిపాల్ కనికరించలేదు. ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేశామని బాధిత విద్యార్థినులు ఆదివారం తెలిపారు.
విద్యార్థినుల జుత్తు కత్తిరింపుపై కేజీబీవీ ప్రిన్సిపాల్ సాయి ప్రసన్నను వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ.. నవంబర్ 15న విద్యార్థినులు ప్రతిజ్ఞకు, తరగతులకు కూడా రాలేదని పేర్కొన్నారు. ఒంటి గంట వరకు జుత్తు విరబోసుకొని తిరుగుతుండగా, వారిలో క్రమశిక్షణ అలవర్చేందుకే కొందరి జుత్తు కొద్దిగా కత్తిరించామని తెలిపారు. పైగా విద్యార్థినుల జుత్తు బాగా పెరిగిపోవడం వల్ల పేలు పట్టి, తలపై కురుపులు వస్తాయని, క్రమశిక్షణగా ఉంటారనే ఉద్దేశంతో జుత్తు కట్ చేశామని, తమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సాయిప్రసన్న తెలిపారు. దీనిపై ఎంఈఓ బాబూరావు పడాల్‌ను వివరణ కోరగా.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎంఈవో బాబూరావుపడాల్ మాట్లాడుతూ.. కేజీబీవీని సందర్శించేందుకు వెళ్లగా ప్రిన్సిపాల్ సెలవులో ఉన్నట్టు చెప్పారు. దీనిపై జిల్లా విద్యాశాఖ, జీసీడీవోకు సమాచారం అందించామని ఆయన వెల్లడించారు.