AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పిల్లలను స్కూల్‌కి తీసుకెళ్లడానికి తండ్రుల కష్టాలు.. భుజాలపై ఎక్కించుకుని వాగు దాటిస్తున్న వైనం..

రావణాసురుడిపై యుద్ధంలో రామలక్ష్మణులను భుజాల మీద ఎక్కించుకున్న ఆంజనేయుడిలా ఇక్కడి తండ్రులు మారతారు. పిల్లలను భుజాల మీదకు ఎక్కించుకుని ఏటికి ఎదురీదుతూ ..

Andhra Pradesh: పిల్లలను స్కూల్‌కి తీసుకెళ్లడానికి తండ్రుల కష్టాలు.. భుజాలపై ఎక్కించుకుని వాగు దాటిస్తున్న వైనం..
Children Problems
Shiva Prajapati
|

Updated on: Oct 19, 2022 | 10:30 PM

Share

రావణాసురుడిపై యుద్ధంలో రామలక్ష్మణులను భుజాల మీద ఎక్కించుకున్న ఆంజనేయుడిలా ఇక్కడి తండ్రులు మారతారు. పిల్లలను భుజాల మీదకు ఎక్కించుకుని ఏటికి ఎదురీదుతూ స్కూల్‌కి తీసుకువెళతారు. నాన్నే వాహనంగా మారతాడు. పిల్లలను క్షేమంగా స్కూల్‌కి తీసుకెళతాడు. తండ్రులు ఒకసారి పిల్లలను ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు తీసుకుని వెళ్లాక, రెండోసారి మళ్లీ వెనక్కి వచ్చి బ్యాగులు, క్యారేజీలను తీసుకెళ్లి పిల్లలకు ఇవ్వాలి. ఇలా రోజుకూ నాలుగు సార్లు తమ్మిలేరు దాటించాలి. ఏరు దాటలేక….బడికి చేరలేక, ఆ గట్టుకు ఈ గట్టుకు మధ్య బతుకు నిత్య నరకంగా మారుతోంది. ఇక్కడ నీళ్లు ఎంతో ఉధృతంగా ప్రవహిస్తుంటాయి. వృద్ధులు వాగు దాటాలంటే ఎవరో ఒకళ్లు తోడు రావాల్సిందే.

సంక్రాంతికో శివరాత్రికో ఓ తాత్కాలిక రోడ్డు పడుతుంది. వానొచ్చినా వరదొచ్చినా అది కొట్టుకుపోతుంది. మళ్లీ కష్టాలు మొదలవుతాయి. ఏరు పొంగితే చదువులు ఆగిపోతాయి. ఎన్నికలప్పుడు నేతలు ఇచ్చే హామీలు మళ్లీ నీటి మీద రాతలవుతాయి అంటున్నారు స్థానికులు. ఇది నిత్య నరకం. బడికి వెళ్లాలంటే ఇలా తండ్రి భుజాల మీద ఎక్కి వెళ్లాల్సిందే. చిన్న పిల్లలనైతే తండ్రులు ఉప్పు ఎక్కించుకుని తీసుకువెళ్తారు. పెద్ద పిల్లలు వాళ్ల తంటాలు వాళ్లే పడాల్సిందే. ఇంత దారుణ పరిస్థితులు ఎక్కడో ఏజెన్సీలో లేవు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి నుంచి ముసునూరు మండలం బలివే, వెంకటాపురం వెళ్లాలంటే తమ్మిలేరు కాలువ దాటాల్సిందే. నిత్యం బలివే, వెంకటాపురం గ్రామాల నుంచి విద్యార్థులు, రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు నడుములోతు నీళ్లలో దిగి కాలువను దాటుతూ విజయరాయి ప్రయాణిస్తుంటారు.

పనులు మానుకుని పిల్లలను ఇలా రోజూ వాగు దాటించాల్సి వస్తోందని తండ్రులు వాపోతున్నారు. చుట్టూ తిరిగి రావాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రమాదమని తెలిసినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలువ దాటాల్సిన పరిస్థితి అక్కడ ప్రజలది. కాలువ ఉధృతంగా ప్రవహించినప్పుడల్లా సుమారు వారం రోజులు పాటు రాకపోకలు పూర్తిగా తెగిపోతాయి. నిత్యం వందల మంది విద్యార్థులు, రోజు కూలీలు, చిరు వ్యాపారులు భయం భయంగా కాలువ దాటుతూ బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. అధికారులు మాత్రం వారి కష్టాలు తమకేవి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పిల్లాడ్ని చూడండి. ఏరు దాటలేక, బడికి చేరలేక….ఆ గట్టున ఉండలేక ఈ గట్టుకు చేరలేక దీర్ఘాలోచనలో పడినట్టున్నాడు.

ఇవి కూడా చదవండి

బలివే గ్రామంలో ప్రతి ఏటా మహాశివరాత్రికి రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఏలూరు జిల్లా నుంచి స్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు బలివే వెళుతూ ఉంటారు. ఆ సమయంలో మాత్రమే తాత్కాలికంగా మట్టితో రహదారిని ఏర్పాటు చేస్తారు. అయితే కాలువ ఉధృతంగా వచ్చినప్పుడు ఆ రహదారి సైతo కొట్టుకుపోతుంది. ఇప్పటికే మట్టితో చాలాసార్లు తాత్కాలిక రహదారి నిర్మించిన నీటి ఉధృతికి కొట్టుకుపోతున్నాయి. అలాగే బలివే వెంకటాపురంలో కొబ్బరి, నిమ్మ పంటలు ఎక్కువ. కూలీలు సైతం వంతెనలేని కారణంగా నీళ్లలో నడుస్తూ పనులకు వెళుతుంటారు. ఇక తమ్మిలేరు వాగు ఉదృతంగా ప్రవహించే సమయంలో సుమారు వారం రోజులు పాటు రోజులపాటు రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది. అలాగే విద్యార్థులు సైతం ఆ సమయంలో స్కూలు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఇప్పటివరకు ఎంతోమంది అధికారులు వచ్చి పరిస్థితి చూసి వెళుతున్నారే తప్ప తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడైనా అధికారులు స్పందించి తమ్మిలేరు కాలవపై బలివే విజయరాయి ప్రాంతాల మధ్య శాశ్వత బ్రిడ్జిని నిర్మించి ప్రజల కష్టాలను తొలగించాలని విన్నవిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..