Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tungudu Village in AP: ఆ ఊర్లో ఒక్క ఫోన్ లేదు.. బస్సులేదు.. ఆస్పత్రి లేదు..108 వాహనానికి ఫోన్ చేయాలంటే 6 కి.మీ. నడవాల్సిందే

ప్రకాశంజిల్లా పశ్చిప్రాంతంలో ఆ గ్రామం ఓ మారుమూల అటవీ ప్రాంతంలో ఉంది. కనిగిరి నియోజకవర్గం సీఎస్ పురం మండలం తుంగూడు గ్రామ ప్రజల వారి జీవన విధానం, వారు జీవిస్తున్న ప్రాంతం చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు. 40 కుటుంబాలు ఈ ప్రాంతంలో జీవిస్తున్నా.. ఆధునిక వసతులకు, సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా జీవిస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు దాటినా ఇంకా అభివృద్ధి చెందని గ్రామాలు ఉన్నాయనడానికి ఈ గ్రామాన్ని చూస్తే అర్థమవుతోంది. తుంగూడు గ్రామస్తులు వాస్తవానికి..

Tungudu Village in AP: ఆ ఊర్లో ఒక్క ఫోన్ లేదు.. బస్సులేదు.. ఆస్పత్రి లేదు..108 వాహనానికి ఫోన్ చేయాలంటే 6 కి.మీ. నడవాల్సిందే
Tungudu Village in AP
Follow us
Fairoz Baig

| Edited By: Srilakshmi C

Updated on: Oct 20, 2023 | 8:16 PM

కనిగిరి, అక్టోబర్ 20: బాహ్య ప్రపంచానికి ఆ గ్రామం చాలా దూరం. మౌలిక సదుపాయాలకు, కనీస వసతులకు కూడా అంతేదూరం. వీరి అలవాట్లే కాదు, భాషలో కూడా యాస ఉంటుంది. దేశానికి స్వాతంత్రం సిద్దించి దశాబ్దాలు గడుస్తున్నా ఈ ఊరు ప్రజలకు మాత్రం ఇంకా స్వాతంత్ర ఫలాలు అందలేదన్నది నిర్వివాదాంశం. ఇదేదో మారుమూల ఆటవిక ప్రాంతం అనుకుంటే పొరపాటే. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందో… ఆ ఊరు విశేషాలేంటో తెలుసుకుందామా…

ప్రకాశంజిల్లా పశ్చిప్రాంతంలో ఆ గ్రామం ఓ మారుమూల అటవీ ప్రాంతంలో ఉంది. కనిగిరి నియోజకవర్గం సీఎస్ పురం మండలం తుంగూడు గ్రామ ప్రజల వారి జీవన విధానం, వారు జీవిస్తున్న ప్రాంతం చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు. 40 కుటుంబాలు ఈ ప్రాంతంలో జీవిస్తున్నా.. ఆధునిక వసతులకు, సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా జీవిస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు దాటినా ఇంకా అభివృద్ధి చెందని గ్రామాలు ఉన్నాయనడానికి ఈ గ్రామాన్ని చూస్తే అర్థమవుతోంది. తుంగూడు గ్రామస్తులు వాస్తవానికి కనిగిరి నియోజకవర్గంలో జీవనం సాగిస్తున్నా గిద్దలూరు నియోజకవర్గం వీరికి కూతవేటు దూరంలోనే ఉంది. బేస్తవారిపేట మండలం కొనపల్లె గ్రామం వీరికి చాలా దగ్గరగా ఉంది. వీరికి ఏ అవసరం వచ్చినా మొదట కంభం, బేస్తవారిపేట ప్రాంతాలకు వెళుతుంటారు. వీరు సిఎస్ పురం గ్రామానికి వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిందే. గతంలో వీరికి కంభం ప్రాంతం నుండి ఉదయం, సాయంత్రం ఓ ట్రిప్ ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. కరోనా మొదటి వేవ్ లాక్ డౌన్ సమయంలో ఉన్న ఈ ఒక్క బస్సు సర్వీసు కూడా నిలిపివేశారు. గతంలో ఉన్న ఆర్టీసీ బస్సు సర్వీసు ద్వారా ఈ గ్రామస్తులు వారి పిల్లల విద్య, వైద్యం వారికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు ఉపయోగపడుతూ ఉండేది. ప్రస్తుతం ఆ ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి.

108కి ఫోన్‌ చేయాలంటూ 6 కిలో మీటర్లు నడవాలి…

ఇక ఈ గ్రామస్తులకు వైద్య సహాయం అవసరమైతే కంభం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందే. అత్యవసర సమయంలో 108 వాహనానికి ఫోన్ చేయాలన్నా 6 కిలోమీటర్లు నడిచి బేస్తవారిపేట మండలం కొనపల్లె గ్రామ సమీపానికి వెళ్లి 108 వాహనానికి సమాచారం అందించాల్సిన పరిస్థితి. ఇక సర్కారు అందిస్తున్న రేషన్ బియ్యం తీసుకోవాలన్న 6 కిలోమీటర్ల మేర నడవాల్సిందే. ఈ ప్రాంతంలో మొబైల్ నెట్వర్క్ కమ్యూనికేషన్ లేకపోవడంతో ఆ సౌకర్యం ఉన్న బేస్తవారిపేట ప్రాంతానికి వెళ్లి వేలి ముద్రలు వేసి రేషన్ పొందుతున్నారు. ఇలా ఈ గ్రామస్తులకు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మౌలిక సదుపాయాల కోసం దశాబ్దాలుగా ఆపసోపాలు పడుతూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

అన్నీ పూరిగుడిసెలె…

ఇక ఈ గ్రామంలో ఇప్పటికీ చాలా మేరకు పూరి గుడిసెలు దర్శనమిస్తాయి. గ్రామంలో ఐదో తరగతి వరకు చదువుకునేందుకు వెసులుబాటు ఉన్నా. ఆ పై చదువులు చదవాలి అంటే వీరు ఇతర ప్రాంతాలకు వెళ్లక తప్పదు. ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు తమ పిల్లల్ని అటు సిఎస్ పురం కానీ లేదా ఇటు బేస్తవారిపేట, కంభం కానీ పంపించవలసిందే అంటున్నారు ఆ గ్రామస్తులు. రోజూ వెళ్లి వచ్చేందుకు వాహన సదుపాయం లేకపోవడంతో వారి పిల్లల్ని హాస్టల్స్ లో ఉంచి చదివిస్తున్నామంటున్నారు. వీరు గిద్దలూరు నియోజక వర్గానికి 50 కిలోమీటర్లు, కనిగిరి నియోజకవర్గానికి 65 కిలోమీటర్లు దూరంలో జీవనం సాగిస్తున్నారు. మౌలిక సదుపాయాల కోసం కంభం, బేస్తవారిపేట, సియస్‌ పురం ప్రాంతాలకు వెళ్లాలంటే 40 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సిందే. ఈ రెండు నియోజకవర్గాలకు చిట్ట చివర ఉండటం. అందులో చుట్టూ కొండలు, అటవీ ప్రాంతం ఉండటం వల్ల తమ గ్రామాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని వాపోతున్నారు… ఎవరూ పట్టించుకోక పోవడం వల్లే తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని తుంగూడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కనిగిరి నియోజకవర్గం లోనే ఉన్నా మౌలిక సదుపాయాల కోసం గిద్దలూరు నియోజక వర్గం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నామని అంటున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో కూడా కనీస మౌలిక సదుపాయాలు పొందేందుకు నిత్యం జీవన్మరణ సమస్యగా పోరాడాటానికి వెనుక స్థానిక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా ఒప్పుకోవాల్సిందేమో. టెక్నాలజీలో ఎంతో ముందుకు దూసుకు వెళ్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి గ్రామాలను చూసైనా ఇంకా వెనుకబడే ఉన్నామని పాలకులు ఆలోచించాలి. మౌలిక సదుపాయాలకు నోచుకోని ఇలాంటి గ్రామాలను ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తిస్తాయని, అభివృద్ధి చేస్తాయని ఆశిద్దాం.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.