Andhra Pradesh: పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం.. మంత్రి అంబటి కీలక కామెంట్.. అంతే కాకుండా
పోలవరం(Polavaram) ప్రాజెక్టు డయాఫ్రం వాల్ విషయం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రం వాల్ గురించి నిజానిజాలు తేల్చాలని నేతలు పట్టుబడుతున్నారు. ఈ సమయంలో టీడీపీ అధినేత...
పోలవరం(Polavaram) ప్రాజెక్టు డయాఫ్రం వాల్ విషయం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రం వాల్ గురించి నిజానిజాలు తేల్చాలని నేతలు పట్టుబడుతున్నారు. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు(Chandrababu) జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) సవాల్ విసిరారు. ఈ విషయం గురించి చర్చించేందుకు రావాలని సవాల్ విసిరారు. ఎవరి చర్య వల్ల దెబ్బతిందో తేల్చుకుందామని పేర్కొన్నారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమకూ సవాల్ విసిరారు. కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ కట్టడం వల్లే వరదలకు దెబ్బతిందని మంత్రి అన్నారు. కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ కట్టడం చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానించారు. డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? కొత్తది నిర్మించాలా? అన్న అంశంపై దేశంలో ఉన్న మేధావులు ప్లాన్ లు చేస్తున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమన్న మంత్రి.. ప్రాజెక్ట్ పూర్తికి గడువు లేదని చెప్పారు. ముందుగా అనుకున్నట్లే జూన్ 1న గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేశామని వివరించారు.
మరోవైపు.. వరదల కారణంగా దెబ్బతిన్న పోలవరం డయాఫ్రం వాల్ విషయంపై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోంది. సమాంతరంగా మరో డయాఫ్రం నిర్మించాలా లేక పూర్తిగా కొత్తదాన్నే నిర్మించాలా అన్న విషయమై కేంద్ర జలశక్తిశాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఏపీ జలవనరుల శాఖ యోచిస్తున్నాయి. 1.7 కిలోమీటర్లు నిర్మించిన డయాఫ్రం వాల్‌లో వరదల కారణంగా 300 మీటర్ల మేర ప్రాంతం ఇసుక కోతకు గురైంది. కోతకు గురైన ప్రాంతాల్లో ఇసుకను నింపేందుకు డ్యామ్‌కు దిగువన 8 కిలోమీటర్ల వద్ద తవ్వకం చేసి తెచ్చి నింపాలని భావిస్తున్నారు. మొత్తానికి డయాఫ్రం వాల్ ఎంతమేర దెబ్బతిందో పూర్తిగా తెలిసేంత వరకూ తదుపరి పనులు చేపట్టలేమని ప్రభుత్వం చెప్పడం విశేషం.
అయితే ప్రస్తుతం బయటకు కనిపిస్తున్న ధ్వంసమైన వాల్ కాకుండా ఇంకా నీటిలోనే ఉన్న డయాఫ్రం వాల్ పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలోనే గజ ఈతగాళ్లను దింపి వీడియోలు తీయించాలనే ఆలోచన చేసినా అది అప్పటి నీటి ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని ఈతగాళ్లు అంత సాహసం చేయలేదు. ఇందుకు సంబంధించి కేంద్ర జలసంఘం ముందు బావర్ కంపెనీ మూడు ప్రతిపాదనలు సూచించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి