SCR: భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. తిరుపతికి ప్రత్యేక రైళ్లు
వేసవి సెలవులు ముగియనుండటం, విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు....
వేసవి సెలవులు ముగియనుండటం, విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి తిరుమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. వేసవి సీజన్‌లో(Summer Season) ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తిరుపతి(Tirupati) కి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 20 రైళ్లు సర్వీసులు అందిస్తాయని వెల్లడించింది. హైదరాబాద్- తిరుపతి, తిరుపతి- హైదరాబాద్, తిరుపతి- కాకినాడ టౌన్, కాకినాడ టౌన్- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇవి నేటి నుంచే పట్టాలెక్కనున్నాయి.
తిరుపతి- హైదరాబాద్ మధ్య 10 ప్రత్యేక రైళ్లు ప్రయాణీకులకు సేవలందించనున్నాయి. ఇవి సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆగుతాయి. తిరుపతి- కాకినాడ టౌన్ మధ్య నడిచే 10 ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. కాచిగూడ- తిరుపతి మధ్య నడిచే రెండు వేసవి ప్రత్యేక రైళ్లు జూన్ 1, జూన్ 2న పట్టాలెక్కుతాయి. ఇవి ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వేస్టేషన్లో ఆగుతాయి.
అంతే కాకుండా 07193 నంబర్ర గల ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి జూన్ 04, 11, 18, 25 తేదీల్లో రాత్రి 11.55 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.10 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. 07194 నంబర్ గల ప్రత్యేక రైలు జూన్ 05, 12, 19, 26 తేదీల్లో రాత్రి 08.45 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 09.30 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి