Andhra: దేవ్‌జీ ఎక్కడ.. ఏపీలో హై అలర్ట్..! 50 మంది మావోయిస్టుల అరెస్ట్..
ఏపీలో హై అలర్ట్..! మావోయిస్టుల కదలికలు పెరగడంతో సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. ప్రస్తుతం అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అసలు మావోయిస్టులు ఏపీకి ఎందుకు మకాం మార్చారు..? ఏపీని అడ్డాగా చేసుకొని ఏం ప్లాన్ చేశారు..? భద్రత బలగాల నెక్ట్స్ టార్గెట్ ఎవరు..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది.. మావోయిస్టుల అరెస్ట్‌లపై ఇవాళ ఏపీ పోలీసులు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.

దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం ఇక గత చరిత్రగానే మిగిలేలా ఉంది. దేశంలో మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్రహోంశాఖ పెట్టుకున్న టార్గెట్‌కి నాలుగునెలల ముందే అగ్రనాయకత్వం కథ దాదాపుగా ముగిసింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌తో 60 ఏళ్ల సుదీర్ఘ సాయుధ పోరాటానికి తెరపడినట్లే కనిపిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్న మోస్ట్ వాంటెడ్ హిడ్మా హతమయ్యాడు. అతని భార్య హేమ అలియాస్ రాజే, మరో నలుగురు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
అయితే.. ఆపరేషన్ కగార్‌తో వరుస ఎన్ కౌంటర్లు, అగ్రనేతల లొంగుబాటులో ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చారన్న సమాచారంతో కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. ఏపీలో 5 జిల్లాలో మకాం వేసిన మావోయిస్టుల కోసం ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ బృందాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఏపీ నడిబొడ్డున మావోయిస్టుల కలకలం రేగింది. కృష్ణాజిల్లాలో తనిఖీలు చేసిన పోలీసులు 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఓ భవనాన్ని షెల్టర్‌గా చేసుకుని మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందడంతో.. విజయవాడ నగర శివారు కానూరు కొత్త ఆటోనగర్‌లో సోదాలు చేపట్టాయి కేంద్రబలగాలు. గత నెల 26న ఏవోబీలో ఎంటరైన హిడ్మా టీమ్.. విజయవాడ, కాకినాడ, విశాఖ, అల్లూరి, విజయనగరంలో మకాం వేసింది. వీరిలో 28 మందిని విజయవాడలో.. ఏలూరులో గ్రీన్ సిటీలో 15 మంది అరెస్ట్ అయ్యారు.. విజయవాడ రామవరప్పాడులో నలుగురు, కాకినాడలో ఇద్దరు, అమలాపురంలో ఒకరు అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.
ఏపీలో ఇప్పటివరకు మొత్తం 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది.. మావోయిస్టుల అరెస్ట్‌లపై ఇవాళ ఏపీ పోలీసులు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఏపీలో భారీగా మావోయిస్టుల అరెస్టులు జరుగుతున్నాయి. ఆయుధాలు వీడడం కోసం కాదు.. ఆయుధాలను సమకూర్చుకోవడం.. తిరిగి ఉద్యమాన్ని బలపర్చడం కోసం జనాల్లోకి వచ్చిన వారిని పోలీసులు పక్కాసమాచారంతో.. చాకచక్యంగా పట్టుకున్నారు.
దేవ్‌జీ ప్రొటెక్షన్ టీమ్ 9 మంది.. 19మంది హిడ్మా గెరిల్లా టీమ్ అరెస్ట్
విజయవాడలో అరెస్ట్ అయిన వారిలో మావోయిస్ట్ అగ్రనేత దేవ్ జీ భద్రతా సిబ్బంది 9 మంది.. హిడ్మా గెరిల్లా టీమ్ 19మంది ఉన్నట్టు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. అరెస్టైనవారంతా ఛత్తీస్‌గఢ్ వాసులుగా గుర్తించారు. షెల్టర్ జోన్‌గా కాకుండా..ఏదో ఏదో నేరానికి పాల్పడే ఉద్దేశంతోనే విజయవాడ వచ్చినట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో భారీ ప్రమాదం తప్పినట్టు చెబుతున్నారు. కూలీ పనుల కోసం వచ్చామని చెప్పిన మావోయిస్టులు అద్దెకు ఉంటామంటూ ఈ భవనంలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు.
ఏలూరులో 12 మంది మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్.. ఏవోబీలో దేవ్ జీ..
మరోవైపు ఏలూరులో 12 మంది మావోయిస్టు సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గ్రీన్ సిటీ లో శివారు భవనంలో వీరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కాకినాడలో పట్టుబడిన ఇద్దరిని కూడా ఏలూరు తరలించారు పోలీసులు. నవంబర్ 19న ఏలూరు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మావోయిస్టులు తమ సానుభూతిపరులను విజయవాడతోపాటు ఇతర ప్రాంతాల్లో రెక్కి నిర్వహించేందుకు తమవెంట తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. పలు చోట్ల డంప్‌లు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు అందిన సమాచారంతో వాటి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరోవైపు భద్రత భద్రతా బలగాల నెక్ట్స్ టార్గెట్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ..! ఇప్పుడు ఇతని కోసమే గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో దేవ్ జీ ఉన్నట్లు భద్రత బలగాల అనుమానం.
మొత్తంగా ఓవైపు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతుండగా.. మరోవైపు మావోయిస్టు దళాలకు, నాయకత్వానికి పట్టణ ప్రాంతాల నుంచి ఆర్థిక, సైద్ధాంతిక మద్దతునిస్తున్న వారిపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు దృషి సారించాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
