Chittoor Rains: చిత్తూరు జిల్లాలో వరుణుడి ప్రకోపం.. కుంభవృష్టి.. విద్యాసంస్థలకు సెలవు
వరుణుడి ప్రకోపం..కుంభవృష్టితో కకావికలమైపోతోంది చిత్తూరు జిల్లా. జల విలయానికి విలవిలలాడిపోతోంది. పట్టణాలు, పల్లెలు నదుల్లా మారిపోయాయి.
వరుణుడి ప్రకోపం..కుంభవృష్టితో కకావికలమైపోతోంది చిత్తూరు జిల్లా. జల విలయానికి విలవిలలాడిపోతోంది. పట్టణాలు, పల్లెలు నదుల్లా మారిపోయాయి. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే. నదులు, వాగులు, వంకలు ప్రమాదకరస్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు ఏకమయ్యాయి. ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి పలు ప్రాంతాలు. ఇప్పటికే కురిసిన కుండపోత వానలకు చిగురుటాకులా వణికిపోతోంది టెంపుల్ సిటీ తిరుపతి. ఉదయం నుంచి తిరుపతి, తిరుమలలో మళ్లీ భారీ వర్షం పడుతోంది. అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు..పాపవినాశనం రహదారిని క్లోజ్ చేసింది టీటీడీ. రాత్రి పూట ఘాడ్‌రోడ్లపై రాకపోకలు నిలిపివేశారు. తిరుమలకు వెళ్లే శ్రీవారి నడకమార్గం పూర్తిగా ధ్వంసమైంది. కొండ పైనుంచి వచ్చిన వరదపోటుతో.. మార్గం పూర్తిగా కొట్టుకుపోయింది.
చిత్తూరు జిల్లాలోని 47 మండలాల్లో 10సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. తిరుమలలో 20 సెంటీమీటర్ల వర్షం పడింది. భారీ వర్షాలతో చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్. వందలాది గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. జిల్లాలో భారీ వర్షాలతో 126 చెరువులకు గండ్లు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఎస్పీడీసీఎల్‌కు భారీ నష్టం వాటిల్లింది. 6ఏళ్ల తర్వాత స్వర్‌ణముఖీ నది ఉగ్రరూపం దాల్చింది. డేంజర్ జోన్‌గా మారిపోయింది స్వర్ణముఖీ నది పరీవాహక ప్రాంతాలు. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్స్ దెబ్బతినడంతో తిరుపతికి రావాల్సిన రైళ్లు రద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే కాక ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి అంతరాయం ఏర్పడింది.
Also Read: AP Rains: కదిరిలో కుప్పకూలిన భవనం.. 4 ఇళ్లు ధ్వంసం.. ఇద్దరు చిన్నారులు మృతి.. శిథిలాల కిందే..