AP Residents Doctors Stipend: ఏపీ సీనియర్ రెసిడెంట్ వైద్యులకు గుడ్‌న్యూస్.. స్టైపండ్ రూ.70వేలకు పెంచుతూ నిర్ణయం!
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సీనియర్ రెసిడెంట్ వైద్యులకు స్టైపండ్‌ను రూ.45వేల నుంచి రూ.70వేలకు పెంచాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు.
AP Residents Doctors Stipend Increase: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ రెసిడెంట్ వైద్యులకు స్టైపండ్‌ను రూ.45వేల నుంచి రూ.70వేలకు పెంచాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గత కొంతకాలంగా తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ రెసిడెంట్ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కరోనా సమయంలో వైద్యులు ఆందోళన చేపట్టడం మంచిది కాదని, వెంటనే విరమించుకోవాలని ఆయన కోరారు.
అలాగే, విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులకు వ్యాక్సినేషన్ వేసే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. విదేశాలకు వెళ్లే వ్యక్తులు తమ పాస్‌పోర్టు నెంబరు కూడా ఇవ్వాలని సింఘాల్ సూచించారు. కొవిన్ యాప్‌లో ఈ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని దీన్ని సవరించే విషయంపై కేంద్రానికి లేఖ రాసినట్టు ఆయన పేర్కొన్నారు. మరో వైపు రాష్ట్రంలో క్రమంగా కోవిడ్ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో పడకల ఖాళీల సంఖ్య పెరుగుతోందని, డిశ్ఛార్జిలు పెరుగుతుండటంతో ఈవెసులుబాటు కలుగుతున్నట్టు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.