Andhra Pradesh: ఏపీ ప్రజలకు షాకిచ్చిన ప్రభుత్వం.. ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న వీటి ధరలు.. వీరికి భారమే..
ఏపీలో భూమలు మార్కెట్ విలువ మరోసారి పెరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి విలువను పెంచింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు స్ఫష్టం చేసింది.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను మరోసారి పెంచుతూ కూటమి సర్కార్ నిర్ణయించింది. దీని వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు అదనంగా భారీగా ఆదాయం లభించనుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్ల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మెమో జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ వస్తోంది. గతంలో ఒకసారి పెంచగా.. ఇప్పుడు మరోసారి పెంచింది. దీంతో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రెండుసార్లు పెంచినట్లయింది.
ఖజానాకు పెరగనున్న ఆదాయం
భూముల విలువ పెంచడంతో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,150 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూమల విలువ పెంపుతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీల ధరలు పెరగనున్నాయి. సగటున 7 నుంచి 8 శాతం వరకు భూముల విలువ పెంచే అవకాశముండగా.. పట్టణ ప్రాంతాలు, జిల్లా కేంద్రాల్లో 15 శాతం వరకు ఉండనుంది. 2025లో వాణిజ్య ప్రాంతాలు, కొత్త జిల్లాల్లో 15 శాతం వరకు భూముల మార్కెట్ విలువను పెంచింది. రియల్ ఎస్టేట్ రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. భూములు రిజిస్ట్రేషన్ ధరలు పెరగడం వల్ల కొనుగోలుదారులు, విక్రయదారులపై అధిక భారం పడనుంది. దీంతో ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి చేదువార్తగా చెప్పవచ్చు. అయితే అమరావతి ప్రాంతంలో భూముల విలువ పెంపు ఉండదని తెలుస్తోంది. అమరావతిలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే నష్టం జరుగుతుందని భావిస్తోంది. అందుకే ఈ పెంపు నుంచి అమరావతికి మినహాయింపు ఇవ్వనుందని తెలుస్తోంది.
ఫుల్ డిమాండ్
ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనుండటంతో ఇప్పుడే తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పుడు చేసుకుంటే తక్కువ ధర పడుతుందనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు క్యూ కడుతున్నారు. కాగా ప్రభుత్వం మరోసారి భూమలు విలువ పెంచడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. దీనిని సమతూల్యం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
