ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కిలో బియ్యం రూ.47 నుంచే.. పండుగ చేసుకునేవార్త..
ఏపీలో బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రభుత్వం ధరలను నిర్ణయించింది. ఈ ధరల్లోపే వ్యాపారులు విక్రయించాల్సి ఉంటుంది. బియ్యం ధరలు పెరుగుతున్న క్రమంలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ధరణి బ్రాండ్ బియ్యంను మొబైల్ వాహనాల ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.

బియ్యం ధరలు పెరుగుతున్న క్రమంలో వాటికి కళ్లెం వేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలకు తక్కువ ధరకే బియ్యం లభించేలా చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ మేరకు ధరలపై నియంత్రణ విధించింది. అలాగే ధాన్యం, బియ్యం నిల్వలపై కూడా ప్రభుత్వం పరిమితులు నిర్ణయించింది. బియ్యం రకాలను బట్టి ధరలు కిలోకు రూ.47 నుంచి రూ.82 వరకు ఉండేలా నిర్ణయించింది. బీపీటీ 3291 (సోనా) రకం, బీపీటీ 5204 (సాంబ) రకం, కేఎన్ఎం (BPT 3291 (Sona) రకం, BPT 5204 రకం, KNM రకం కేజీ రూ.66గా నిర్ణయించింది.
ఇక హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ (HMT, RNR) రకం కిలో రూ.76గా ప్రభుత్వం నిర్ణయించగా.. జైశ్రీరామ్ రకం కిలో రూ.82, ఎంటీయూ సాధారణ రకాలు కేజీ రూ.47గా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎంటీయూ రకం బియ్యం 26 కిలోల బస్తా ధరను రూ.1222గా నిర్ణయించింది. ఈ ధరల కంటే ఎక్కువ రేట్లకు వ్యాపారులు, మిల్లర్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక ధరణి బ్రాండ్ 26 కిలోల బియ్యం బస్తాలను రైతు బజార్లు, ప్రత్యేక కేంద్రాల్లో ప్రభుత్వం తక్కువ ధరకే విక్రయిస్తోంది. అయితే ఈ బియ్యంను మొబైల్ వాహనాల ద్వారా కూడా విక్రయించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. బియ్యంను తక్కువ ధరకే ప్రజలకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరోవైపు నిత్యావసర సరుకులను తక్కువ ధరలకే ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా అందిస్తోంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి తక్కువ ధరకు ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనుంది. కందిపప్పు కిలో రూ.100కు అందించనుండగా.. గోధుమ పిండి కిలో రూ.25, లీటర్ పామాయిల్ రూ.125కు అందించనుంది. అలాగే రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లి రూ.35కే అందిస్తోంది. ఆధార్ కార్డు తీసుకెళ్లి ఉల్లిపాయలను సబ్సిడీ ధరల్లో తీసుకోవచ్చు.
కాగా ఎల్‌నివో ప్రభావంతో దేశవ్యాప్తంగా బియ్యం ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కిలో బియ్యం రూ.100కి చేరుకుంది. 26 కిలోల బస్తా కొనాలంటే రూ.3 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీనిని అదునుగా చేసుకుని వ్యాపారులు, మిల్లర్లు అధిక ధరలకు బియ్యంను విక్రయిస్తున్నారు. దీనిని నివారించేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా బియ్యం ధరలకు గరిష్ట పరిమితులు నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఈ ధరల్లోపు బియ్యంను విక్రయించాలి. లేకపోతే వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హెచ్చరించింది.
