AP: పెన్షన్ల పంపిణీపై కొత్త విధి విధానాలు.. రేపటి నుంచే పంపిణీ, కానీ..

సిఈసీ ఆదేశాల వెనుక తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదులే కార‌ణ‌మంటూ అధికార వైసీపీ ఆరోప‌ణ‌లు చేస్తోంది. సిటిజ‌న్స్ ఫ‌ర్ డెమొక్ర‌సీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే వ‌లంటీర్ల విష‌యంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీఈసీ ఇచ్చిన స‌ర్కులర్‌లో పేర్కొంది. అస‌లు సిటిజ‌న్స్ ఫ‌ర్ డెమొక్ర‌సీ సంస్థలో ఉన్న నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్... ఇత‌ర స‌భ్యులు టీడీపీకి అనుకూలంగా...

AP: పెన్షన్ల పంపిణీపై కొత్త విధి విధానాలు.. రేపటి నుంచే పంపిణీ, కానీ..
Ap Pension
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Apr 02, 2024 | 5:41 PM

ఆంధ్రప్ర‌దేశ్‌లో సామాజిక పెన్ష‌న్ల పంపిణీపై ర‌గ‌డ కొన‌సాగుతూనే ఉంది. వాలంటీర్ల‌ను ఎన్నిక‌ల విధుల‌కు దూరంగా ఉంచాలంటూ స‌ర్కుల‌ర్ ఇచ్చిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం, వారిని పెన్ష‌న్ల పంపిణీకి కూడా దూరంగా పెట్టాల‌ని ఆదేశించింది. ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాల‌కు వాలంటీర్ల చేత న‌గ‌దు పంపిణీ చేయించ‌వ‌ద్ద‌ని ఆదేశాలిచ్చింది. కేంద్ర ఎన్నిక‌ల క‌మిషన్ ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో రాజ‌కీయ ర‌చ్చ‌కు దారి తీశాయి. పెన్ష‌న్ల పంపిణీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల‌ని సీఈసీ సూచించింది,

సిఈసీ ఆదేశాల వెనుక తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదులే కార‌ణ‌మంటూ అధికార వైసీపీ ఆరోప‌ణ‌లు చేస్తోంది. సిటిజ‌న్స్ ఫ‌ర్ డెమొక్ర‌సీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే వ‌లంటీర్ల విష‌యంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీఈసీ ఇచ్చిన స‌ర్కులర్‌లో పేర్కొంది. అస‌లు సిటిజ‌న్స్ ఫ‌ర్ డెమొక్ర‌సీ సంస్థలో ఉన్న నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్… ఇత‌ర స‌భ్యులు టీడీపీకి అనుకూలంగా ప‌నిచేసే వ్య‌క్తులంటూ వైసీపీ ఆరోప‌ణ‌లు గుప్పిస్తుంది. ఈ సంస్థ‌ను అడ్డుపెట్టుకుని వృద్దుల‌ను, ఇత‌ర పెన్ష‌నర్ల‌ను ఇబ్బంది పెట్టేలా తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌హ‌రిస్తుందంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ కూడా వెంట‌నే అల‌ర్ట్ అయింది. వ్య‌వ‌హారం త‌మ‌కు చుట్టుకుంటుంద‌ని అనుకున్న టీడీపీ కౌంట‌ర్లు ఇచ్చే ప‌నిలో ప‌డింది.

ఇదంతా జ‌రుగుతుండ‌గానే పెన్ష‌న్ల పంపిణీని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా చేయాల‌ని… దానికి త‌గ్గ ఆదేశాలిస్తూ సెర్ప్ సీఈవో ముర‌ళీధ‌ర్ రెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వుల వ‌ల్ల పెన్ష‌న్ దారులు ఇబ్బంది ప‌డ‌తార‌ని గ్రామ‌,వార్డు స‌చివాల‌య సిబ్బంది ద్వారా ఇంటింటికీ పెన్ష‌న్లు పంపిణీ చేసేలా చూడాల‌ని సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డిని క‌లిసి తెలుగుదేశం పార్టీ నాయ‌కులు వినతిప‌త్రం ఇచ్చారు. ఈ ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు కొన‌సాగుతుండ‌గానే జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో చర్చించిన సీఎస్… తాజాగా కొత్త విధివిధానాల‌ను జారీ చేశారు.

పెన్ష‌న్ల పంపిణీపై వ‌స్తున్న ఫిర్యాదుల‌తో జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వాస్త‌వ ప‌రిస్థితిపై వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్ రెడ్డి చ‌ర్చించారు. క‌లెక్ట‌ర్ల అభిప్రాయాలు స్వీక‌రించారు..జిల్లా కలెక్ట‌ర్ల అభిప్రాయాలు, అందుబాటులో ఉన్న స‌చివాల‌య సిబ్బందిని పరిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌ర్వాత కొత్త‌గా పెన్ష‌న్ల పంపిణీకి పంచాయ‌తీ రాజ్ శాఖ ద్వారా ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో 2ల‌క్ష‌ల 66 వేల 158 మంది వాలంటీర్లు ఉంటే ల‌క్షా 27వేల 177 మంది మాత్ర‌మే స‌చివాల‌య సిబ్బంది ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం గుర్తించింది. స‌చివాల‌య సిబ్బందిలో కొంత‌మంది బీఎల్ వోలుగా ఇప్ప‌టికే ఎన్నిక‌ల విధుల్లో ఉన్నారు. దీంతో స‌చివాల‌య సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేక‌పోవ‌డంతో భారీ మొత్తంలో ఉన్న పెన్ష‌న్ దారుల‌కు ఇంటింటికీ పెన్ష‌న్లు పంపిణీ చేయ‌డం వీలుకాద‌ని ప్ర‌భుత్వం నిర్ధారించింది. దీంతో కేట‌గిరీలుగా పంపిణీకి ఆదేశాలిచ్చింది. ప‌లు కేట‌గిరీలుగా విభ‌జించి పెన్ష‌న్ల‌ను పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు.

కొంత‌మందికి ఇంటింటికీ పంపిణీ చేసి మ‌రికొంద‌రికి స‌చివాల‌యాల వ‌ద్ద పంపిణీ చేసేలా ఆదేశాలిచ్చారు..దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డేవారు, అస్వ‌స్థ‌త‌కు గురైన‌వారు, మంచాన‌ప‌డ్డవారు, వృద్ద వితంతువుల‌కు ఇంటివ‌ద్ద పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇక అల్లూరి సీతారామ‌రాజు, మ‌న్యం వంటి జిల్లాల్లో గ్రామ స‌చివాల‌యాల‌కు దూరంగా ఉన్న నివాస ప్రాంతాల వారికి పెన్ష‌న్ల పంపిణీ కోసం ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. రేపు మ‌ధ్యాహ్నం నుంచి ఈనెల 6 లోగా పెన్ష‌న్ల పంపిణీ చేయాల‌ని ఆదేశాలిచ్చారు. పెన్ష‌న్ల పంపిణీ స‌మ‌యంలో ఉద‌యం 9 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కూ స‌చివాల‌యాలు ప‌నిచేయాల‌ని ఉత్త‌ర్వులో వెల్ల‌డించారు పంచాయ‌తీ రాజ్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శ‌శిభూష‌ణ్ కుమార్..ప్ర‌భుత్వం ఇచ్చిన తాజా ఆదేశాల‌తో పెన్ష‌న్ల పంపిణీ పంచాయ‌తీకి చెక్ ప‌డుతుందేమో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..