Gangavaram Port Workers Strike: గంగవరం కార్మికుల పోరాటం ఇక ముగిసినట్టేనా? 62 రోజుల తర్వాత విధుల్లోకి..
గంగవరం పోర్టు కార్మికుల 62 రోజుల స్ట్రైక్ సుఖాంతం అయింది. తమ డిమాండ్ల పై పూర్తిగా కాకపోయినా యాజమాన్యం అదాని గంగవరం పోర్ట్ స్పందన పై కార్మికులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమల శాఖా మంత్రి అమర్ సమక్షంలో నిన్నటి చర్చల ఒప్పందాలను అంగీకరించారు కార్మికులు. తక్షణం విధుల్లోకి..

అమరావతి, సెప్టెంబర్ 1: గంగవరం పోర్టు కార్మికుల 62 రోజుల స్ట్రైక్ సుఖాంతం అయింది. తమ డిమాండ్ల పై పూర్తిగా కాకపోయినా యాజమాన్యం అదాని గంగవరం పోర్ట్ స్పందన పై కార్మికులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమల శాఖా మంత్రి అమర్ సమక్షంలో నిన్నటి చర్చల ఒప్పందాలను అంగీకరించారు కార్మికులు. తక్షణం విధుల్లోకి వెళ్ళిపోయారు. దీంతో 62 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిరవధిక దీక్షలకు తెర పడ్డట్టు అయింది.
దాదాపు 15 ఏళ్లుగా సాగుతున్న పోరాటం ఇది. పోర్ట్ ఏర్పాటులో తమ ఇల్లు, పొలాలు, ఉపాధి కోల్పోయిన వారికి శాశ్వత ఉద్యోగం కల్పించలాన్నది అప్పటి హామీ. అయితే ఫ్యాక్టరీస్ యాక్ట్ కింద ఏర్పాటైన గంగవరం పోర్టు లిమిటెడ్ లో కాకుండా దానికి అనుసంధానంగా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ కింద ఏర్పాటు చేసిన గంగవరం పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో తమకు నామ మాత్రపు ఉద్యోగాలు ఇచ్చారని తమ జీతాలను 10 వేల నుంచి గంగవరం పోర్ట్ లిమిటెడ్ లో ఇస్తున్నట్టు 36 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇంక్రిమెంట్ ల తో వాళ్ళ జీతం ఇప్పుడు 15 వేలకు చేరింది కానీ అంతకుమించి పెరగక పోతుండటం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు చేయలేక పోతున్నామని, అనారోగ్యం తో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీంతో 36 వేల జీతం డిమాండ్ ను తెరపైకి తెచ్చి 62 రోజులుగా స్ట్రైక్ చేస్తూ వస్తున్నారు.
36 వేల జీతం కోసం పట్టు పట్టారు కానీ…
ప్రధానమైన డిమాండ్ నెలకు 32 వేల జీతం. అయితే ప్రస్తుతం వస్తున్న 15 వేల రూపాయలకు అదనంగా మరో 1500 వేసి దానిపై యేటా 5 శాతం ఇంక్రిమెంట్ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ముందు కార్మికులు ఇందుకు ఒప్పుకోలేదు కానీ అంతకు మించి ఇవ్వలేమని యాజమాన్యం స్పష్టం చేయగా ప్రభుత్వం కూడా తెగే దాకా లాగొద్దని సూచించింది. మరో ప్రధాన సమస్య ఉద్యోగం లోనుంచి తీసేసిన 10 మందికి తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేసినా పాత యాజమాన్యం సమయంలో తీసేసిన ఐదు మందిని తీసుకోలేమని, ఈ అదానీ గంగవరం పోర్ట్ గా మారిన తర్వాత తీసేసిన వాళ్ళను తిరిగి తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించడంతో ఆ సమస్య పరిష్కారం అయిపోయింది




62 రోజుల స్ట్రైక్ పీరియడ్ వేతనం కోసం పట్టు పట్టినా…
యాజమాన్య వైఖరిని ఖండిస్తూ 62 రోజులుగా చేస్తున్న స్ట్రైక్ పీరియడ్ కు వేతనం కావాలని కార్మికులు పట్టుబట్టారు. అయితే నో వర్క్ – నో పే విధానం అమలులో ఉందని, కాబట్టి స్ట్రైక్ పీరియడ్ కు వేతనం ఇవ్వలేమని తెగేసి చెప్పింది యాజమాన్యం. కార్మికులు కూడా పట్టు వీడక పోవడం తో మంత్రి అమర్ యాజమాన్యాన్ని పునరాలోచిచాలని కోరాడు. దీంతో గరిష్టంగా 21 రోజులకు మాత్రమే ఇవ్వగలమని యాజమాన్యం చెప్పడం తో మిగతా రోజులకు ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపంలో సహాయం చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇక డెత్ బెన్ఫిట్స్ కింద 20 లక్షలు, మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స లాంటి పలు డిమాండ్లను యాజమాన్యం అంగీకరించింది
అయితే సీ ఐ టీ టీ లాంటి కార్మిక సంఘాలు మాత్రం మొదట ఈ ప్రతిపాదనలకు ఒప్పుకోలేదు. అదానీ యాజమాన్యానికి ప్రభుత్వం దాసోహం అయిందంటూ తమదైన శైలిలో విమర్శలు చేశారు. అయినప్పటికి అదానీ యాజమాన్యం ఇక ఇంతకంటే కిందకు వచ్చే అవకాశం ఉండదని, ఇకపై చర్చల్లో ప్రభుత్వం కూడా పాల్గొనేబోదని స్పష్టం చేయడం తో ఈరోజు ప్రత్యేకంగా సమావేశం పెట్టుకున్న కార్మికులు విధుల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకుని మధ్యాహ్నం తర్వాత విధుల్లోకి వెళ్లి పోవడం తో కథ అక్కడకు సుఖాంతం అయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




