AP CM YS Jagan: శ్రీశారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏపీ సీఎం.. రాజశ్యామల యాగంలో పాల్గొన్న వైఎస్ జగన్
రాజశ్యామల దేవి యాగంలో సీఎం జగన్ పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం శారదా పీఠంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు.
AP CM YS Jagan Visakhapatnam tour: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) బుధవారం నాడు విశాఖపట్నంలోని శ్రీశారదా విద్యాపీఠం(Sharada vidya peeth)వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఉదయం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో విశాఖ పట్టణానికి చేరుకున్నారు. సీఎం జగన్ వెంట టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు.
విశాఖపట్టణం ఎయిర్‌పోర్టు నుండి నేరుగా సీఎం జగన్ రోడ్డు మార్గం ద్వారా మూషివాడలోని శ్రీశారదా పీఠానికి చేరుకున్నారు. సీఎం జగన్ వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం లభించింది. రాజశ్యామల దేవి యాగంలో సీఎం జగన్ పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం శారదా పీఠంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా మాఘమాసం పంచమి నుండి దశమి వరకు శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం విశాఖపట్నం చేరుకున్నారు. సీఎం పర్యటన పురస్కరించుకుని పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది.
అంతకు ముందు విశాఖకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం 11. 45 గంటలకు సిఎం జగన్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విచ్చేశారు. విమానాశ్రయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర పర్యాటక శాఖ ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అక్కడి నుండి ముఖ్యమంత్రి శారదా పీఠం వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరివెళ్లారు.