YS Jagan: ప్రజలందరికీ అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యంః సీఎం జగన్
వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటి సర్వే కొనసాగాలని..
కోవిడ్ నియంత్రణ, వైద్య రంగంలో నాడు-నేడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నేపధ్యంలోనే అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమన్నారు. ప్రజలందరూ కూడా కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తెలిపారు.
ఇంటింటి సర్వే కొనసాగించడంతో పాటు లక్షణాలు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని సూచించారు. అలాగే 104 నెంబర్ యంత్రాంగం సమర్థవంతంగా సేవలందించేలా నిరంతరం పర్యవేక్షణ, సమీక్ష చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. విలేజ్ క్లినిక్స్‌ను పీహెచ్‌సీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేయాలని సూచించారు. ప్రతీ గ్రామంలో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్ జరగాలన్నారు. అటు 45 ఏళ్లు పైబడినవారు, గర్భవతులు, ఆ తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగాలని ముఖ్యమంత్రి అన్నారు.
మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల్లోని పనులపై సీఎంకు అధికారులు వివరించారు. వైద్యారోగ్య రంగంలో నాడు – నేడు పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న జగన్.. నిధుల పరంగా ఒక కార్యాచరణతో ముందుకు రావాలని తెలిపారు. ఈ తరాలకే కాదు, భవిష్యత్తు తరాలవారికీ కూడా అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేయాలని సీఎం జగన్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి కూడా వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులను ఎంపిక చేసుకునేలా వాటిని తీర్చిదిద్దాలని వెల్లడించారు.