AP Police: స్వరాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలలో ఈ పాస్‌లు ఎప్పుడు అవసరం, ఎలా పొందాలి.. పూర్తి వివరాలు తెలిపిన ఏపీ పోలీస్ శాఖ
పొరుగు రాష్ట్రాలలో ఈపాస్ నిబంధనలను ఆకళింపు చేసుకొని ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. ఈ-పాస్ లేకుండా ప్రయాణించడం....
పొరుగు రాష్ట్రాలలో ఈపాస్ నిబంధనలను ఆకళింపు చేసుకొని ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. ఈ-పాస్ లేకుండా ప్రయాణించడం ద్వారా రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఇప్పటికే తమ దృష్టికి వచ్చిందని డీజీపీ కార్యలయం తెలిపింది. ప్రజల సౌకర్యార్థం పొరుగు రాష్ట్రాలలో అమలవుతున్న ఈపాస్ నిబంధనలను డీజీపీ కార్యాలయం వెల్లడించింది.
A) ఇతర రాష్ట్రాల నుండి ఏపీ కి రావాలనుకొంటే:
ఆంద్రప్రదేశ్ లో ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాలనుకొనే వారు, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉదయం 6 గంటల నుండి 12:00 గంటల మధ్యనే ప్రయాణించేలా, ఆ లోపే తమ గమ్యానికి చేరుకునేలా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోగలిగితే అట్టి వారికి ఎలాంటి పాస్ లు అవసరం లేదు. ఆ సమయం కాకుండా మిగతా సమయంలో ప్రయాణించదలిస్తే ఈపాస్ కచ్చితంగా అవసరం ఉంటుంది. అంటే ఉదయం పన్నెండు తర్వాత బోర్డర్ దాటి ఏపీ భూభాగం లోకి ప్రవేశించాలనుకునే వారు లేదా ఆంధ్ర ప్రదేశ్ భూభాగం లో 12 గంటల తర్వాత ప్రయాణించాలనుకొనే వారికి ఈపాస్ అవసరం. ప్రభుత్వం G.O లో పేర్కొన్న మినహాయింపు సేవలు అనగా అత్యవసర సేవలు, అంబులెన్స్ తదితర సేవలు, సంబంధిత సిబ్బందికి ఎలాంటి ఈ-పాస్ అవసరం లేదు.
B) రాష్ట్రంలో ఒక ప్రదేశాన్నుండి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే:
అలాగే రాష్ట్రంలో ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి ఉదయం 6 గంటల నుండి 12:00 గంటల మధ్యనే ప్రయాణించేలా, ఆ లోపే తమ గమ్యాన్ని చేరుకునేలా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోగలిగితే అట్టి వారికి కూడా ఎలాంటి ఈపాస్ లు అవసరం లేదు. ఆ సమయం కాకుండా మిగతా సమయంలో ప్రయాణించదలిస్తే మాత్రం ఈపాస్ కచ్చితంగా అవసరం ఉంటుంది. అట్టి వారు తప్పనిసరిగా పూర్తి దృవ పత్రాలతో ఈ-పాస్ కు అప్లై చేసి ఈపాస్ పొందగలరు. ప్రభుత్వం G.O లో పేర్కొన్న మినహాయింపు సేవలు మరియు సంబంధిత సిబ్బందికి ఎలాంటి ఈ-పాస్ అవసరం లేదు.
C) ఈ పాస్ లింక్ పొందడం ఎలా?:
ఆంధ్ర ప్రదేశ్ లో కర్ఫ్యూ సమయంలో ప్రయాణానికి తప్పనిసరిగా సిటిజన్ సర్వీస్ పోర్టల్(http://appolice.gov.in), ట్విట్టర్ (@APPOLICE100), ఫేస్ బుక్ (@ANDHRAPRADESHSTATEPOLICE) ద్వారా ఈపాస్ పొందవచ్చు.
D) తెలంగాణా లోకి ప్రవేశించాలంటే ఈపాస్ తప్పనిసరి:
తెలంగాణాలో ఉదయం 6 నుండి 10 వరకు కర్ఫ్యూ ఉండదు. మిగతా సమయాల్లో కర్ఫ్యూ ఉంటుంది. కానీ తెలంగాణా భూభాగంలోకి ప్రవేశించాలంటే, కర్ఫ్యూ ఉన్నా లేక పోయినా పాస్ తప్పనిసరి. అట్టివారు https://policeportal.tspolice.gov.in/ ద్వారా తెలంగాణ ఈ-పాస్ పొందిన తర్వాతే ప్రయాణించాల్సి ఉంటుంది.
E) తమిళనాడు లోకి ప్రవేశించాలంటే ఈపాస్ తప్పనిసరి:
తమిళనాడు లో పూర్తి స్థాయి లో కర్ఫ్యూ అమలో ఉంది. తమిళనాడు భూభాగంలోకి ప్రవేశించాలంటే, కర్ఫ్యూ ఉన్నా లేక పోయినా పాస్ తప్పని సరి. అట్టివారు (https://eregister.tnega.org/) ద్వారా తమిళనాడు ఈ-పాస్ పొందవచ్చు.
F) ఒరిస్సా రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ఈపాస్ తప్పనిసరి:
ఒరిస్సా లో పూర్తి స్థాయి లో కర్ఫ్యూ అమలో ఉంది. ఒరిస్సా భూభాగంలోకి ప్రవేశించాలంటే, కర్ఫ్యూ ఉన్నా లేక పోయినా పాస్ తప్పనిసరి. అట్టివారు (https://covid19regd.odisha.gov.in/) అనే లింక్ ద్వారా ఈ-పాస్ పొందవచ్చు.
G) కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే:
కర్ణాటక లో పూర్తి స్థాయి లో కర్ఫ్యూ అమలో ఉంది. కర్ణాటక భూభాగంలోకి ప్రవేశించాలంటే ఆ రాష్ట్రంలో ఈపాస్ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లింక్ ద్వారా కర్నాటక లోకి కూడా పాస్ ఇవ్వబడును. కానీ కర్ణాటక ప్రభుత్వం అవసరాన్ని బట్టే వారి భూభాగం లోకి ప్రవేశానికి అనుమతి ఇస్తుందన్న విషయాన్ని గమనించగలరు.
H) ఆంధ్ర ప్రదేశ్ నుండి వివిధ రాష్ట్రాలకు అంబులెన్స్ లో ప్రయాణించే పేషంట్ లతో పాటు ఉండే సహాయకులకు అనుక్షణం సహాయసహకారాలను అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సామాజిక మాధ్యమాలు (ట్విట్టర్, ఫేస్ బుక్) ద్వారా నిరంతరం అందుబాటులో ఉంటుంది.
I) శుభకార్యాలు, అంతక్రియలకు సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి సంబంధిత స్థానిక అధికారుల వద్ద సరైన గుర్తింపు పత్రాలతో అనుమతి పొందాలి.
ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అనుక్షణం ప్రజల రక్షణ కోసం మీ వెంటే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యవసర సమయాల్లో తప్ప మిగతా సమయంలో ఇంటి పట్టున ఉంటూ స్వీయ రక్షణ పొందగలరని మనవి.