Andhra Pradesh: మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం కీలక ప్రకటన
మరో ఎన్నికల హామీ అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే.. పెన్షన్లపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోగా.. తాజాగా.. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.

ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్ వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై.. రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెలలోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందజేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో అమలవుతోన్న ఉచిత బస్సు సౌకర్యంపై పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అమలులో ఎదురయ్యే సమస్యలపై పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నట్లు వివరించారు. తాము తీసుకునే నిర్ణయం ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, మహిళలకు ఉపయోగపడేలా ఉంటుందని చెప్పారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. రానున్న ఐదేళ్లు మహిళామణులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. కాగా సచివాలయం నాలుగో బ్లాక్‌లో ఉన్న ఛాంబర్లో రాంప్రసాద్‌రెడ్డి రవాణా, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఏపీలోని ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుపై రాంప్రసాద్‌రెడ్డి తొలి సంతకం చేశారు. రాష్ట్రంలో క్రీడా వసతులు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ప్రోత్సహకాలు అందజేస్తామని తెలిపారు. ఆర్టీసీలో ప్రమాదాల నివారణపై తమ ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. తన పరిధిలోని మూడు శాఖలకు వనరులను కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
