Pawan Kalyan: ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కన్నెర్ర

ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై కన్నెర్ర చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. చిన్న చేపలను వేటాడడం కాదు...పెద్ద పెద్ద తిమింగలాలను లోపల వేసెయ్యాలన్నారు. దుంగల దొంగలను పట్టుకోవడంతో సరిపెట్టొద్దు. రెడ్‌ శాండల్‌ దందా వెనుక పెద్ద తలకాయలను పట్టుకోవాలంటూ అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. శేషాచలం అడవులను ఖాళీ చేస్తున్న స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలన్నారు.

Pawan Kalyan: ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కన్నెర్ర
Pawan Kalyan
Follow us

|

Updated on: Jul 06, 2024 | 9:33 AM

రెడ్ శాండల్‌ స్మగ్లర్ల విషయంలో ఇన్నాళ్లు ఒక లెక్క…ఇక నుంచి మరో లెక్క అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. దుంగల్‌ – దొంగల్‌ బ్యాచ్‌ భరతం పడతామంటున్నారు పవన్‌. ఇన్నాళ్లు చిన్న తలకాయల అరెస్టులతో సరిపెట్టిన అధికారులు…ఇక బడా స్మగ్లర్ల అంతు చూడాలని అటవీశాఖను ఆదేశించారు డిప్యూటీ సీఎం.

దుంగలను ఎక్కడ దాచారో గుర్తించండి

అటవీశాఖకు, నిఘా వర్గాలకు పెద్ద టాస్క్‌ అప్పగించారు పవన్‌ కల్యాణ్‌. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్న చిన్న చేపలతో ఆట కాదు…బడా తిమింగలాలను వేటాడాలి. వాళ్లు శేషాచలం అడవుల నుంచి కొట్టేసిన రెడ్‌ శాండల్‌ దుంగలను ఎక్కడెక్కడ దాచిపెట్టారో తక్షణమే గుర్తించాలన్నారు పవన్‌. మన ఎర్ర బంగారం…దేశం దాటిపోతోందని, దానికి అడ్డుకట్ట వేసేందుకు నిఘా వ్యవస్థలను పటిష్టపరచాలని అటవీ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు.

అటవీ అధికారులతో పవన్‌ రివ్యూ

ఇటీవల కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి దగ్గర లారీలో లోడ్‌ చేసిన 158 ఎర్రచందనం దుంగలను సీజ్ చేశారు పోలీసులు. ఆ ఎర్రచందనం దుంగలకు ప్లాస్టిక్ పట్టాలు కట్టి తరలిస్తున్నారు స్మగ్లర్లు. ఐతే పోలీసుల రాక గమనించిన స్మగ్లర్లు దుంగలు వదిలి పరారయ్యారు. ఈ నేపథ్యంలో రెడ్‌ శాండల్‌ తరలింపుకు అడ్డుకట్ట వేసేందుకు అటవీ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్‌. శేషాచలం అడవుల్లో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌ వ్యవహారంపై ఆరా తీశారు. చిన్న చిన్న స్మగ్లర్లు కాదు… వాళ్లను నడిపిస్తున్న పెద్ద తలకాయలు ఎవరు? అనేదానిపై తీగ లాగి, ఎర్రచందనం దందా డొంక కదిలించాలని ఆదేశించారు. స్మగ్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు ఆపరేషన్‌ పుష్ప స్టార్ట్‌ చేయాలంటూ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

విదేశాల్లో 8వేల టన్నుల రెడ్ శాండల్‌

మరోవైపు నేపాల్ లో దొరికిన ఎర్రచందనం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు వైసీపీ నేత నాగార్జున యాదవ్‌. నేపాల్‌, మలేషియా, దుబాయ్‌..తదితర దేశాల్లో దాదాపు 8 వేల టన్నుల రెడ్‌ శాండల్‌ పట్టుబడిందని, వాటిని ఏపీకి తెప్పించడానికి గత జగన్‌ సర్కార్‌ ఎన్నోసార్లు కేంద్రానికి లేఖ రాసిందని, గత మే నెలలోనే అనుమతులు కూడా తీసుకుందన్నారు నాగార్జున యాదవ్‌. దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు అటవీ శాఖలోనే ఉన్నాయని, కావాలంటే పవన్‌ వాటిని చదువుకోవచ్చన్నారు.

పవన్‌ కల్యాణ్‌, సీరియస్‌గా దృష్టి సారించిన నేపథ్యంలో….రెడ్‌ శాండల్‌ స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు అటవీ శాఖ సిద్ధమవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.