Anandaiah Medicine in Ongole: కృష్ణపట్నం ఆనందయ్య మందు కోసం జనం ఆరాటం.. ఒంగోలులో వైసీపీ నేతల పోటా పోటీ పంపిణీ
కరోనాకు మందు పేరుతో ప్రచారంలో ఉన్న కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి ఒంగోలులో వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు.
Anandaiah Medicine Competitive Distribution in Ongole: కరోనాకు మందు పేరుతో ప్రచారంలో ఉన్న కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి ఒంగోలులో వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలు ఈ విషయంలో ఎవరికి వారు విడివిడిగా పంపిణీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఇద్దరు నేతల మధ్య ఇటీవల మనస్పర్ధలు నెలకొన్న నేపధ్యంలో ఎవరికి వారే విడివిడిగా ఆనందయ్య మందును ఉచితంగా పంపిణీకు ఏర్పాట్లు చేయడంతో జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రెండు చోట్ల ఆనందయ్య మందుకోసం జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో మందు పంపిణీ నేతలకు తలకుమించిన భారంగా మారింది.
ఆనందయ్య మందు పంపిణీకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఒంగోలులో ఇద్దరు నేతలు వేర్వేరుగా మందు పంపిణీ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అనుచరులు విడివిడిగా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇద్దరి నేతల తరఫున వారి అనుచరులు మందు పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు.
ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర హైస్కూల్ ఆవరణలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభించారు. మాగుంట కార్యాలయ సిబ్బంది, వైసీపీలోని ఆయన అనుచరగణం అందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాత్రికి మాగుంట కూడా ఒంగోలు చేరుకొని స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు, పోలీసు సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. నిజానికి బాలినేని, మాగుంట ఒకే పార్టీలో ఉంటూ ఒకే ప్రాంతానికి వారు ప్రాతినిథ్యం వహిస్తున్నందున ఇలాంటి సేవా కార్యక్రమాలు సమష్టిగా, మరింత ప్రజోపకరంగా నిర్వహించవచ్చు. అలాంటిదేమీ లేకుండా ఇద్దరు నేతలు పోటీపడి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారి మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటమవుతోంది. ఫలితంగా అధికారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే, తమ మధ్య అభిప్రాయబేధాలు లేవని, మందు ఎవరు పంపిణీ చేసినా ప్రజల కోసమేనని ఎంపీ మాగుంట శ్రీనివాసులు చెబుతున్నారు…
మరోవైపు మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఇంటి దగ్గర ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు మందు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన అనుచరులు ప్రారంభించారు. ఒంగోలు కార్పొరేషన్ మేయర్ సుజాత, వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు ఆధ్వర్యంలో ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నారు. దీంతో మంత్రి బాలినేని ఇంటి దగ్గరకు జనం పెద్ద ఎత్తున చేరుకున్నారు. జనం ఎక్కువగా రావడంతో క్యూలైన్లు ఏర్పాటు చేసి మందు పంపిణీ చేస్తున్నారు. తొలుత ఐదువేల మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, జనం ఎక్కువగా రావడంతో మందు అయిపోవడంతో చాలామంది నిరాశతో వెనుతిరిగారు. అయితే మందు పంపిణీ రోజూ జరుగుతుందని, ఎవరూ నిరాశచెందవద్దని మంత్రి బాలినేని అనుచరులు చెబుతున్నారు. తాము ఎంపీ మాగుంట కుటుంబానికి పోటీగా మందు పంపిణీ చేయడం లేదని, ఎంతమంది నేతలు పంపిణీ చేసినా ప్రజలకోసమేనని చెబుతున్నారు.