పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల అమలుపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మూడో ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. రోజు వారీ విచారణ జరిపి, త్వరగా కేసును ముగించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టును కోరింది.
నాట్ బిఫోర్ మీ… కారణంతో ఇప్పటికి రెండు ధర్మాసనాల ముందు విచారణ జరగలేదు. తాజాగా జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్. సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఆ ధర్మాసనం కూడా విచారణకు నిరాకరించింది.
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు స్టేటస్‌కో ఇచ్చింది. ఇది రేపటి వరకు అమలులో ఉంటుంది. దానిపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే రెండు సార్లు నాట్ బిఫోర్ మీ కారణంతో విచారణ నుంచి తప్పుకున్నారు ఇద్దరు న్యాయమూర్తులు. దాని వల్ల విచారణ జరగకుండానే కేసు వాయిదా పడుతూ వచ్చింది.
తొలుత గత సోమవారం 17వ తేదీనే దీనిపై విచారణ జరగాల్సి ఉంది. చీఫ్ జస్టిస్ బాబ్డే ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణను చేపట్టాల్సి ఉంది. ఆయన కుమార్తె రుక్మిణి ప్రతివాదులైన రైతుల తరపున గతంలో వాదించిన విషయాన్ని సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో చీఫ్ జస్టిస్ ఈ విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని సూచించారు.
రెండోసారి విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ నారీమన్ అదే కారణంతో మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. న్యాయమూర్తి నారీమన్ తండ్రి ఫాలీ నారీమన్‌ను రాజధాని రైతులు తమ తరపున న్యాయవాదిగా పెట్టుకున్నారు. అందువల్ల ఆయన కూడా విచారణ నుంచి తప్పుకున్నారు. మరి ఇవాళ ముచ్చటగా మూడో ధర్మాసనం ముందు కేసు వచ్చినా విచారణకు అంగీకరించలేదు.