Peddireddy : జూలై 8న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’, సర్పంచ్‌లతో మంత్రి వీడియో కాన్ఫెరెన్స్.. సీఎం మెచ్చేలాపేరు తెచ్చుకోండని సూచన
గ్రామ సచివాలయ వ్యవస్థను చక్కగా ఉపయోగించుకొని పరిపాలనా దక్షులుగా పేరు తెచ్చుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సర్పంచ్‌లకు సూచించారు...
Panchayati raj minister peddireddy video conference with village presidents : గ్రామ సచివాలయ వ్యవస్థను చక్కగా ఉపయోగించుకొని పరిపాలనా దక్షులుగా పేరు తెచ్చుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సర్పంచ్‌లకు సూచించారు. ప్రజాసేవలో నిమగ్నమైన సర్పంచ్‌లను గుర్తించి సత్కరించడం జరుగుతుందన్న ఆయన, సర్పంచ్‌లకు నిధులు కూడా ఇబ్బంది లేకుండా ఇప్పటికే 15 ఫైనాన్స్ టైడ్ గ్రాంట్ కింద రూ.656.2 కోట్లు, అంటైర్ గ్రాంట్ కింద రూ.652.2 కోట్లు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. మొత్తం రూ.1312.4 కోట్లు స్వచ్ఛ సంకల్పానికి ఖర్చు చేయడానికి ఇచ్చామని, కొవిడ్ నియంత్రణ కోసం రూ.387 కోట్లు ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమంపై సర్పంచ్‌లతో మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇచ్చేందుకు కొంత ఆలస్యమైందని వివరించిన పెద్దిరెడ్డి.. 13,095 సర్పంచ్‌లకు గానూ 11,152 మందికి ఇప్పటికే చెక్ పవర్ ఇవ్వడం జరిగిందన్నారు. మిగతా 1,943 మందికి ఒకటి రెండు రోజుల్లో చెక్ పవర్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. జూలై 8వ తేదీన స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని… ప్రజలు మెచ్చుకునే విధంగా, సీఎం వైయస్ జగన్ అభినందనలు పొందేలా సర్పంచ్‌లు పనిచేయాలని కోరుకుంటున్నానని మంత్రి అన్నారు.
సర్పంచ్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామీణ పరిపాలనలో జగన్ పెనుమార్పులు తెచ్చారని మంత్రి తెలిపారు. గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా మన గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్, మిల్క్ కలెక్షన్ సెంటర్లు కనిపిస్తున్నాయి.. 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించి సంక్షేమ పథకాలు గుమ్మం ముందుకే తెచ్చారు.. వీటన్నిటినీ సక్రమంగా ఉపయోగించుకుని ముందుకు సాగండని మంత్రి సర్పంచులకు సూచనలు చేశారు.