AP Government: కారుణ్య నియామకాలపై ఏపీ సర్కార్ ఫోకస్.. 45 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి.!
AP Government: కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య నియామకాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన...

కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య నియామకాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు కసరత్తులు చేస్తున్నారు. కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల వివరాలను శాఖల వారీగా సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు కరోనాతో ఎంతమంది మరణించారన్న దానిపై పూర్తిస్థాయిలో లెక్కలు లేవని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. క్రింద స్థాయిలోనే దాదాపు 2 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా కారణంగా మరణించారని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700 మంది టీచర్లు, వివిధ విభాగాల్లో హెచ్‌ఓడీలుగా పని చేస్తోన్న 300 మంది ఉద్యోగులు, ఆర్టీసీలో 770 మంది ఉద్యోగులు, ఏపీ సచివాలయంలో సుమారు 20 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరణించారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం చేపట్టడానికి రెండేళ్ల గడువు పడుతుంది. అయితే ఈ ప్రక్రియను 45 రోజుల్లోనే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇక ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.