ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్: రెండు కొత్త పథకాలకు శ్రీకారం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజాపాలనలో తనదైన ముద్రవేసుకుంటున్నారు. ఎన్నికల హామీల్లో ప్రకటించిన నవరత్న పథకాలు మాత్రమే కాకుండా ప్రజలకు అవసరమైన అనేక పథకాలను అమల్లోకి తీసుకువస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా..

  • Jyothi Gadda
  • Publish Date - 12:12 pm, Mon, 7 September 20
ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్: రెండు కొత్త పథకాలకు శ్రీకారం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజాపాలనలో తనదైన ముద్రవేసుకుంటున్నారు. ఎన్నికల హామీల్లో ప్రకటించిన నవరత్న పథకాలు మాత్రమే కాకుండా ప్రజలకు అవసరమైన అనేక పథకాలను అమల్లోకి తీసుకువస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రజా సౌలభ్యానికి ఉపయోగపడేలా పథకాల్లో మార్పులూ చేర్పులు చేపడుతున్నారు. దేశంలో స్వైరవిహారం చేస్తున్న కరోనా నేపథ్యంలోనూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. తాజాగా మహిళలు, చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధచూపెడుతూ రెండు సరికొత్త పథకాలను ప్రారంభించారు. ఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలకు శ్రీకారం చుట్టారు.

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గర్భిణీలతో పాటు 6 నుంచి 72 నెలల్లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించనున్నారు.

వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం కింద 77 గిరిజన మండలాల్లో రూ. 307.55 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది. ఇందులో భాగంగా గర్భిణులు, బాలింతలకు నెలలో 25 రోజులపాటు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, గుడ్డు అందజేస్తారు. టేక్‌ హోమ్‌ న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 2 కిలోల మల్టీ గ్రెయిన్‌ ఆటా, అర కిలో వేరుశనగ చిక్కీ, అరకిలో రాగి పిండి, అరకిలో బెల్లం, అరకిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేయనున్నారు.

వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద 77 గిరిజన మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా రూ. 1555.56 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో గర్భిణీలు, బాలింతలకు నెలలో 25 రోజులు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, కోడి గుడ్లు సరఫరా చేస్తారు. టేక్‌ హోం న్యూట్రిషన్‌ కిట్‌ కింద నెలకు 250 గ్రాముల వేరుశనగ చిక్కీ, కిలో రాగి పిండి, 250 గ్రాముల బెల్లం, మరో 250 గ్రాముల ఎండు ఖర్జూరం, కిలో సజ్జ పిండి అందిస్తారు.