Andhra: ఈదురుగాలులకు ఎగిరిపోయిన పోలీస్ స్టేషన్ ప్రధాన ద్వారం తలుపు
చట్టం ముందు అందరూ సమానులే....తప్పు చేసినవాడు ఎంతటి వాడైనా చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. పోలిసుల పని తీరు గురించి మాట్లాడే సందర్భంలో సినిమాల్లోనూ, వాస్తవిక జీవితంలోనూ మనం తరచూ వినే డైలాగ్ ఇది. అయితే ఇది కేవలం పోలీసులకు ,న్యాయ వ్యవస్థకు మాత్రమే పరిమితం కాదు. ప్రతృతి విపత్తులదీ ఇదే తీరు. తుఫానులు, ఈదురు గాలులు, భూకంపాలు, సునామీలు, టోర్నడోలు ఇలా ప్రకృతి విపత్తులు ఏవైనా అవి రాకుండా ఉండాలి కానీ.. వచ్చాయంటే మాత్రం వాటిని ఎదుర్కొని నిలబడటం ఎవరితరము కాదు. వాటి ముందు ఎంతటి వారైనా బలాదూరే.

ఇంతకీ ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే శ్రీకాకుళం జిల్లాలో గురువారం అర్థరాత్రి ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. భారీ ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఫుట్ పాత్‌లపై ఉండే చిరు దుకాణాలను చిందర వందర చేశాయి ఈదురు గాలులు. అయితే ఇలా ఈదురు గాలులకు నష్టపోయిన వారి జాబితాలో రైతులు, చిరు వ్యాపారులే కాదు పోలీసులు కూడా ఉన్నారు. అవునండీ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ప్రధాన డోర్ ఈదురు గాలులకు ఎగిరి పడింది. బయట నుంచి బలమైన గాలులు నేరుగా డోర్‌ను తాకడంతో పాటు.. తలుపు పక్కనే విశాలంగా కిటికీ ఓపెన్‌గా ఉండటంతో ద్వారానికి ఉన్న చెక్క డోర్ విరిగి బయటకు ఎగిరిపోయింది.
పోలీస్ స్టేషన్ ప్రధాన డోర్ విరిగి బయటకు ఎగిరిపోవడంతో రక్షక భటనిలయంగా పిలువబడే పోలీస్ స్టేషన్‌కే రక్షణ కరువైంది. రాత్రంతా వీధుల్లో పెట్రోలింగ్ చేస్తూ ప్రజలకు రక్షణగా నిలిచే రక్షక భటులు పోలీస్ స్టేషన్ లో గురువారం రాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. శుక్రవారం ఈ విషయం ఆ నోటా ఈ నోటా వ్యాపించి అంతటా దీనిపైనే చర్చించుకుంటున్నారు. పోలిసులు అయినా.. ఇంకెవరైనా విపత్తులు ముందు చేసేది ఏమి ఉండదని గుసగుసలాడుకుంటున్నారు. మరికొందరైతే పోలీస్ స్టేషన్ నిర్మాణంలోని మెటీరియల్ నాణ్యతపైన చర్చించుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
