Andhra Pradesh: ఎట్టకేలకు అలీకి దక్కిన పదవి.. జగన్ సర్కార్ ఏం పోస్ట్ ఇచ్చిందంటే
2019 ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేనలతో పాటు వైసీపీతో మంతనాలు జరిపారు అలీ. చివరికి జగన్ నుంచి స్పష్టమైన హామి రావడంతో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
సినిమాల్లో తిరుగులేని కమెడియన్‌గా దశాబ్ధాలు పాటు అలీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఓ మోస్తారుగా అవకాశాలు తగ్గాయి. ఇక పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా మెలిగారు. పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో చాలాసార్లు పాల్గొన్నారు. పార్టీకి సేవలందినా కానీ ఎలాంటి పదవులు దక్కలేదు. గత ఎన్నికల్లో పదవి హామితో వైసీపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినప్పటికీ.. ఎమ్మెల్సీ హోదాలో మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు ఈ నటుడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. అదిగో పదవి.. ఇదిగో పదవి అంటూ ప్రచారం జరిగింది. రాజ్యసభ అని కొన్నాళ్లు.. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవి అని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. కానీ అవన్నీ వదంతలుగానే మిగిలిపోయాయి.
తాజాగా అలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు జగన్. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు అలీ. ఆయన జీతభత్యాలు, అలవెన్సులకు సంబంధించి మరోసారి ఉత్తర్వులు ఇస్తామని జీవోలో పేర్కొన్నారు. గవర్నమెంట్ అడ్వైజర్లకు రూ.3లక్షల వరకు వేతనం ఉంటుంది. అదనంగా కొన్ని అలవెన్సులు అందుతాయి. కాగా ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే లెక్కకు మించిన సలహాదారులు ఉన్నారు. ఆ లిస్ట్‌లో అలీ కూడా చేరిపోయారు. అయితే పలువురు సలహాదారులకు కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు జగన్. కానీ అలీకి అలాంటి హోదా ఇస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో ఎక్కడా రాయలేదు. అలీ సమ్మతం తెలిపిన పిమ్మటే.. ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేస్తున్న సమయంలో తన ఆప్తమిత్రుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సైతం విబేధించారు అలీ. ఆయన నుంచి కొన్నాళ్లు డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. మొత్తానికి ఇలా సలాహాదారు పదవి ఆయన్ను వరించింది. మరి ఈసారి ఎన్నికల్లో అయినా అలీకి ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందో, లేదో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..