Zika virus: మాయదారి రోగం మళ్లీ దాపురించింది.. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం..!

ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్ లక్షణాలు కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.. బాలుడికి మెరుగైన వైద్యం కోసం చెన్నై ఆసుపత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర మంత్రి ఆనం రాంనారయణరెడ్డి స్పందించారు. జిల్లాలో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.

Zika virus: మాయదారి రోగం మళ్లీ దాపురించింది.. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం..!
Zika Virus
Follow us
Ch Murali

| Edited By: Balaraju Goud

Updated on: Dec 18, 2024 | 4:11 PM

కరోనా మహమ్మారి తర్వాత ఏ వైరస్ పేరు విన్నా వెన్నులో వణుకు పుడుతోంది. ఆమధ్య దేశ వ్యాప్తంగా కలకలం రేపిన జీకా వైరస్ బెడద తప్పిందని అనుకుంటుండగా మరోసారి భయం మొదలైంది. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ ఇప్పుడు కలకలం రేపింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో ఆరేళ్ళ భత్తల సుబ్బారాయుడు అనే పిల్లాడికి జికా వైరస్ లక్షణాలు కనిపించడంతో జిల్లాలో ఒక్కసారిగా అధికారులు అలెర్ట్ ఐయ్యారు. దీంతో బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.

ఆరేళ్ళ సుబ్బరాయుడుకి అనారోగ్య సమస్యలు రావడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం నెల్లూరు లోని ఓ ప్రయివేటు హాస్పిటల్ లో చూపించారు. బాలుడి అనారోగ్య లక్షణాలపై వైద్యులకు అనుమానం రావడంతో ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. జికా వైరస్ లక్షణాలు ఉన్నాయని గుర్తించిన వైద్యులు మరోసారి రక్త నమూనాలు సేకరించి పూణేలోని ల్యాబ్ కు పంపించారు. ముందస్తు చర్యల్లో భాగంగా వైద్యులు సలహాతో కుటుంబ సభ్యులు బాలుడిని చెన్నైకి తరలించారు. జికా వైరస్ అనే వదంతులు రావడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్పందించి వెంకటాపురంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

మరోవైపు నెల్లూరు జిల్లాలో జికా వైరస్‌ కలకలంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. ‘అనారోగ్యానికి గురైన బాలుడికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్పొరేట్‌ వైద్యం కోసం చెన్నై తరలించామని, జీజీహెచ్‌ వైద్యులతో పాటు వెంకటాపురం గ్రామానికి ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లాయని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు..

జికా వైరస్ అంటే ఏమిటి?

జికా వైరస్ అనేది ఫ్లేవివైరస్, ఇది ప్రధానంగా ఈడెస్ దోమలు, ముఖ్యంగా ఈడిస్ ఈజిప్టి ద్వారా వ్యాపిస్తుంది. 1947లో, శాస్త్రవేత్తలు ఉగాండాలోని జికా అడవిలో ఒక కోతిలో వైరస్‌ను కనుగొన్నారు. 1952 నాటికి, మొదటి మానవ కేసులు ఉగాండా, టాంజానియాలో కనుగొన్నారు. రక్త నమూనాలలో ప్రతిరోధకాల ఉనికి ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించారు. అప్పటి నుండి, వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాప్తికి కారణమైంది. ఈ వైరస్ లైంగిక సంపర్కం ద్వారా, రక్తమార్పిడి ద్వారా గర్భధారణ సమయంలో తల్లి నుండి పిండానికి వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

జికా వైరస్ లక్షణాలు…..

జికా వైరస్ సంక్రమణ లక్షణాలు సాధారణంగా తేలికపాటివి. తరచుగా డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ఇతర దోమల వలన కలిగే అనారోగ్యాలను పోలి ఉంటాయి. అవి సాధారణంగా వైరస్‌ను మోసే దోమ కుట్టిన 2 నుండి 14 రోజుల తర్వాత కనిపిస్తాయి. చాలా రోజుల నుండి ఒక వారం వరకు జ్వరం ఉంటాయి.

జ్వరం: తక్కువ-స్థాయి జ్వరం తరచుగా Zika సంక్రమణ మొదటి సంకేతాలలో ఒకటి.

దద్దుర్లు: ఎరుపు, దురద దద్దుర్లు తరచుగా శరీరం అంతటా వ్యాపిస్తాయి. ముఖం నుండి మొదలై క్రిందికి కదులుతాయి.

కీళ్ల నొప్పి: చాలా మంది రోగులు కీళ్ల నొప్పులను అనుభవిస్తారు. ముఖ్యంగా చేతులు, కాళ్ళలో, ఇది అసౌకర్యంగా ఉంటుంది.

నివారణ: దోమల నియంత్రణ: కంటైనర్‌లలో నీరు నిలవడం వంటి దోమల వృద్ధి ప్రదేశాలను తొలగించడం ద్వారా దోమల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు..

వ్యక్తిగత రక్షణ: కీటక వికర్షకాలను ఉపయోగించడం, పొడవాటి చేతుల ఉన్న దుస్తులు ధరించడం, దోమతెరల కింద పడుకోవడం ద్వారా కాటును నివారించవచ్చు.

సురక్షితమైన లైంగిక పద్ధతులు: కండోమ్‌లను ఉపయోగించడం, సోకిన భాగస్వాములతో సెక్స్‌కు దూరంగా ఉండటం వలన లైంగిక సంక్రమణను తగ్గించవచ్చు..

ప్రయాణ జాగ్రత్తలు: గర్భిణీ స్త్రీలు చురుకుగా జికా వైరస్ వ్యాపించే ప్రాంతాలకు ప్రయాణించకుండా ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..