Andhra News: వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం.. దొంగ ఎవరా అని చూడగా..
ప్రకాశం జిల్లా కనిగిరిలో చుట్టాలింటికే కన్నం వేసిందో మహిళ... చుట్టుం చూపుగా ఇంటికి వచ్చి బంగారం, డబ్బు ఎక్కడెక్కడున్నాయో రెక్కీ చేసి మరీ పక్కా ప్లాన్ ప్రకారం పాతిక సవర్ల బంగారు నగలు ఎత్తుకెళ్ళింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర నుంచి రూ.12.50 లక్షల విలువైన పాతిక సవర్ల బంగారు నగలను రికవరీ చేశారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలోని పాతకూచిపూడిపల్లిలో నివాసం ఉంటున్న బత్తుల వెంటకరమణ, శ్రీను దంపతులు గత నెల నవంబర్ 4వ తేదిన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళారు. తిరిగి వచ్చి చూసుకునే సరికి వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, కానీ ఇంట్లో నగలు మాయం అయ్యాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు క్రైం నెంబర్ 22/2024 U/s 454, 380 IPC కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
బంధువే చోరీ చేసినట్టు గుర్తింపు
పామూరుకు చెందిన వేముల అఖిల అనే మహిళ కనిగిరిలోని పాతకూచిపూడిపల్లిలో ఉంటున్న బత్తుల వెంకటరమణకు బంధువు.. అఖిల తరచుగా వెంకటరమణ ఇంటికి వచ్చే వెళ్ళే క్రమంలో ఇంట్లో బంగారు నగలు ఉంచే ప్రదేశాన్ని గుర్తించింది. అంతేకాకుండా వెంకటరమణ దంపతులు బయటకు వెళ్ళే సమయంలో ఇంటికి తాళం వేసి మెట్లకింద పెడుతున్నట్టు గమనించింది. దీంతో సమయం కోసం వేచిచూసింది. నవంబర్ 4 తేదీన వెంకటరమణ దంపతులు ఇంటికి తాళం వేసి ఎప్పటిలాగే తాళం చెవులను మెట్ల కింద దాచి బయటకు వెళ్ళారు. ఇదే అదనుగా భావించిన అఖిల మెట్ల కింద ఉన్న తాళాన్ని తీసుకుని ఇంట్లోకి దూరింది. బీరువాలో ఉన్న25 సవర్ల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్ళింది. తిరిగి యధాలాపంగా ఇంటికి తాళం వేసి ఎప్పటిలాగే మెట్లకింద పెట్టి ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోయింది. ఇంటికి తిరిగి వచ్చిన వెంకటరమణకు ఇంట్లో బంగారు నగలు మాయం కావడంతో పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. వేసిన తాళాలు వేసినట్టుగానే ఉండటంతో ఈ చోరీకి పాల్పడింది ఎవరో తెలిసిన వారై ఉంటారన్న అనుమానంతో లోతుగా దర్యాప్తు చేయడంతో అఖిలపై అనుమానం వచ్చింది. అఖిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ చోరీ వ్యవహారం బయటపడింది. దీంతో అఖిల నుంచి రూ.12.50 లక్షల విలువైన 25 సవర్ల బంగారు నగలను పోలీసులు స్వాధనం చేసుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి