AP – Telangana: తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. ఏడుగురు దుర్మరణం
అయ్యో భగవంతుడా.. ఎందుకు ఇలా..? వారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా.. ప్రమాదం జరిగింది. వీరు ఉర్సు ఉత్సవాల్లో భాగంగా దర్గాకు వెళ్లి.. తిరుగు ప్రయాణమయ్యేందుకు సిద్దమయ్యారు. అంతలోనే మృత్యు శకటం దూసుకొచ్చింది. ఈ రెండు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం చెందారు. మరికొందరు ఆస్పత్రిలో తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాటం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడాయి. సత్యసాయి, నల్గొండ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. పలువరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుళ్లసముద్రం నేషనల్ హైవేపై శనివారం తెల్లవారుజామన ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్‌లో చనిపోయారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులు ఘటనా స్థలానికి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని హిందూపురం, బెంగుళూరు ఆసుపత్రులకు తరలించారు. మృతులు గుడిబండ, అమరాపురం మండలాల చెందినవారిగా పొలీసుల ప్రాథమికంగా నిర్ధారించారు. తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో మినీ వ్యానులో 14 మంది ఉన్నట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగంలోకి దిగి అంతా క్లియర్ చేశారు.
నల్గొండ జిల్లా దేవరకొండలో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకసారిగా వేగంగా వచ్చిన డీసీఎం దర్గా దగ్గర కూర్చున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంలో స్పాట్‌కి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా ఎర్రారం గ్రామవాసులుగా గుర్తించారు. అతి వేగం, డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవ్ చేయడమే ప్రమాదానికి గల కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని గ్రామానికి వెళ్లేందుకు దర్గా గదిలో ఉన్న వారిపైకి డీసీఎం దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురి చనిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదం నింపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..