Sankranti: గోదారోళ్లతో మామూలుగా ఉండదు మరి.. 379 రకాల వంటకాలతో కొత్త అల్లుడికి విందు..
సంక్రాంతికి ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి 379 రకాల వంటకాలతో విందు భోజనం వడ్డించి ఆశ్చర్యపరిచారు. అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు..

అసలే సంక్రాంతి పండుగ.. అందులోనూ అల్లుడిగారి రాక.. ఇక గోదారోళ్ల మర్యాద మామూలుగా ఉండదు మరి. అతిథి మర్యాదకు పెట్టింది పేరి గోదావరి జిల్లాల ప్రజలు. సంక్రాంతికి ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి 379 రకాల వంటకాలతో విందు భోజనం వడ్డించి ఔరా అనిపించారు. ఆ వంటకాలన్నీ చూసి ఆశ్చర్యపోవడం అల్లుడి వంతైంది. డైనింగ్ టేబుల్ మొత్తం.. ఎక్కడా ఖాళీ లేకుండా అన్ని వంటకాలతో నింపేశారు అత్తగారు. కొత్తగా వచ్చిన అల్లుడు.. ఈ మర్యాదలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు నగరం దొంగల మండపానికి చెందిన భీమారావు, చంద్రలీల దంపతులు.. గతేడాది ఏప్రిల్ లో అనకాపల్లికి చెందిన మురళీకి తమ కుమార్తెనిచ్చి వివాహం చేశారు. పెళ్లైన తరువాత వచ్చిన తొలి సంక్రాంతి కావడం, పండుగకు కూతురు, అల్లుడు రావడంతో.. కనీ వినీ ఎరుగని రీతిలో అతిథి మర్యాదులు ఏర్పాటు చేశారు. అల్లుడి రాక సందర్భంగా ఏదైనా చేయాలని సంకల్పించిన ఆ కుటుంబం.. పిండివంటలు, కూరలు, వేపుళ్లు, స్వీట్లు, పండ్లు, కూల్ డ్రింక్స్, పచ్చళ్లు ఇలా 379 రకాల వంటకాలను సిద్ధం చేశారు. వంటకాలన్నింటినీ డైనింగ్ టేబుల్ నిండా పెట్టి.. అల్లుడు, కూతురుని భోజనానికి పిలిచారు. ఇంకేముంది.. వాటన్నింటినీ చూసి షాక్ అవడం అల్లుడి వంతైంది. ఇక దంపతులిద్దరూ అటు అల్లుడు, ఇటు కూతురికి కొసరి కొసరి తినిపించారు.
అయితే, గోదావరి జిల్లాలు సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలనీ.. ఇక్కడి అతిథి మర్యాదలను వైభవంగా చాటాలనే ఉద్దేశంతోనే 379 రకాల వంటకాలను సిద్ధం చేసినట్లు తెలిపారు భీమారావు దంపతులు.




అంతకుముందు.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యాపార వేత్త తటవర్తి బద్రి, సంధ్య దంపతులు తమ అల్లుడికి 173 రకాల వంటకాలు చేసి వడ్డించారు. సంక్రాంతికి కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచి ఘనంగా అతిథి మర్యాదలు చేశారు. ఎంతో ప్రేమగా అత్తమామలు వడ్డించిన 173 వంటలను తినడం కష్టమైనా.. అల్లుడుగారు ఇష్టంగానే అన్ని వంటకాలు రుచి చూశాడు. వారి మర్యాదలకు అల్లుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..