నా కంటే గొప్ప పర్యావరణవేత్త మరొకరు ఉండరు ః ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడోర్ రూజ్‌వెల్ట్ తర్వాత గొప్ప పర్యావరణవేత్త ఎవరైనా ఉన్నారంటే అది తానేనని గొప్పగా చెప్పుకున్నారు డోనాల్డ్ ట్రంప్.. అలాగని కొంతమంది సెనేటర్ల ఆయన ఆఫీసుకొచ్చి మెచ్చుకుని వెళ్లారట!

అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడోర్ రూజ్‌వెల్ట్ తర్వాత గొప్ప పర్యావరణవేత్త ఎవరైనా ఉన్నారంటే అది తానేనని గొప్పగా చెప్పుకున్నారు డోనాల్డ్ ట్రంప్.. అలాగని కొంతమంది సెనేటర్ల ఆయన ఆఫీసుకొచ్చి మెచ్చుకుని వెళ్లారట! ఈ విషయాన్నే ట్రంప్ ప్రస్తావిస్తూ అసలు మోస్ట్ పవర్‌ఫుల్ ఎన్విరాన్‌మెంటల్ ప్రెసిడెంట్‌ను తానేనని గొప్పగా చెప్పుకున్నారు.. అలా ఎందుకు చెప్పుకున్నారంటే ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా ప్రాంతాలలో ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్‌పై నిషేధం విధించినందుకట! తాను పర్యావరణ ప్రేమికుడిని కాబట్టే ఆ పని చేయగలిగానంటూ తనను తాను పొగిడేసుకున్నారు. అద్సరేగానీ, పారిస్ పర్యావరణ ఒప్పందం-2015 నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్‌గారేనా ఇలా గొప్పలు చెప్పుకునేది అని దెప్పిపొడుస్తున్నవారూ ఎక్కువగానే ఉన్నారు.. ఇదో ఎన్నికల స్టంట్‌గానే భావించాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రతి విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు ట్రంప్.. తుఫానులు, వరదల వంటి ప్రకృతి వైపరిత్యాలు ఎక్కువగా ఉండే జార్జియా, దక్షిణ కరోలినా తీర ప్రాంతాలలో చమురు, గ్యాస్ తవ్వకాలపై తాత్కాలిక నిషేధం ప్రకటించిన మాట వాస్తవమే కానీ, అంత మాత్రం చేత తానో గొప్ప పర్యావరణ ప్రేమికుడనని చెప్పుకోవడం భావ్యం కాదంటున్నారు కొందరు. అందుకే పర్యావరణ ఒప్పందం నుంచి బయటపడిన ట్రంపే ఇప్పుడు మాట మార్చేసి పర్యావరణ జపం చేస్తున్నారని అంటున్నారు. ఆత్మస్తుతితో పాటు పరనిందలు కూడా చేశారు ట్రంప్.. తన ప్రత్యర్థి బైడెన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే అమెరికా పర్యావరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని ట్రంప్ ఆరోపించారు. తన ప్రభుత్వం చాలా గొప్పగా పని చేస్తుందని తనకు తాను ఓ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు.
