Joe Biden Inauguration Day : అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడన్​ ప్రమాణం..

Sanjay Kasula

|

Updated on: Jan 21, 2021 | 4:14 AM

బైడెన్​ ప్రమాణస్వీకార మహోత్సవానికి అతిథులు తరలివచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా ఆయన సతీమణి మిషెల్​ ఒబామా, మాజీ అధ్యక్షుడు బిల్​ క్లింటన్​, ఆయన సతీమణి హిల్లరి క్లింటన్​ హాజరయ్యారు.

Joe Biden Inauguration Day : అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడన్​ ప్రమాణం..

Joe Biden Inauguration Day : అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైంది. ట్రంప్‌ శకం ముగిసింది. జో బైడెన్‌ శకం స్టార్ట్‌ మొదలైంది. అమెరికాకు 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ బైడెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తన కుటుంబానికి చెందిన 127 ఏళ్ల నాటి బైబిల్‌పై బైడెన్ ప్రమాణం చేశారు. 78 ఏళ్ల వయసులో జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్ద వయసులో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా జో బైడెన్ కొత్త రికార్డు సృష్టించారు.

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. వైస్‌ ప్రెసిడెంట్‌గా కమలా హ్యారిస్‌ ప్రమాణం చేస్తారు. కరోనా నిబంధనల కారణంగా కేవలం వెయ్యిమంది మాత్రమే ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Jan 2021 04:14 AM (IST)

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్వీట్..

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌.. అధికారిక సలహాదారు హోదాలో దేశ‌ ప్రజలకు వీడ్కోలు సందేశాన్నిచ్చారు. కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం విజయవంతం కావాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌, వారి సిబ్బందికి ప్రజాసేవకు సంసిద్ధులను చేసే శక్తి సామర్థ్యాలను ప్రసాదించాల్సిందిగా భగవంతుడిని కోరుకుంటున్నట్టు ఇవాంకా తన సందేశంలో పేర్కొన్నారు. అధ్యక్షుడి సలహాదారుగా వ్యవహరించటం తనకు జీవిత కాలంలో దక్కిన అపూర్వ గౌరవమని ఆమె పేర్కొన్నారు. తాను అమెరికన్‌ ప్రజల తరపున నిలిచి పోరాడేందుకే శ్వేత సౌధానికి వచ్చానని.. ఆ పనిలో విజయవంతమైనట్టే భావిస్తున్నానని 39ఏళ్ల ఇవాంకా తెలిపారు.

  • 21 Jan 2021 04:07 AM (IST)

    ఇది నీ టైం.. జో బైడెన్‌కు అభినందనలు- మాజీ అధ్యక్షుడు ఒబామా

    అమెరికా 46వ అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసిన జో బైడెన్‌కు మాజీ అధ్యక్షుడు ఒబామా కంగ్రాట్స్ చెప్పారు. ప్రమాణ స్వీకార వేడుక జరగడానికి ముందే ఒబామా ట్వీట్ చేశారు. వైట్ హౌస్‌లో తనతోపాటు నడుస్తున్న బైడెన్ ఫొటోను ఆయన షేర్ చేశారు. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2009-2017 మధ్య బైడెన్ ఉపాధ్యక్షుడిగా సేవలందించిన సంగతి  తెలిసిందే. నా మిత్రుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అభినందనలు… ఇది నీ టైం.. అంటూ ఒబామా ట్వీట్ చేశారు.

  • 21 Jan 2021 02:01 AM (IST)

    అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల బంధం మరింత బలోపేతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • 21 Jan 2021 12:41 AM (IST)

    బైడెన్‌ అత్యంత వయోధికుడైన అమెరికా అధ్యక్షుడిగా రికార్డు..

    అమెరికా నూతనాధ్యక్షుడిగా ప్రమాణం చేసిన బైడెన్‌ అత్యంత పెద్ద వయస్సు కలిగిన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. 48 ఏళ్ల క్రితమే సెనేటర్‌గా ఎన్నికైన బైడెన్.. ఇప్పటివరకు ఆరు సార్లు సెనేటర్‌గా పనిచేశారు. 1988, 2008లోనూ బైడెన్‌ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడ్డారు. 1988లో అధ్యక్ష ఎన్నికల నుంచి ముందుగానే పోటీ నుంచి వైదొలిగారు. ఒబామా హయాంలో రెండు సార్లు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

  • 21 Jan 2021 12:22 AM (IST)

    శ్వేత వర్ణ అహంకారాన్ని తప్పకుండా ఓడిస్తాం.. -అధ్యక్షుడు జో బైడెన్

    దేశాభివృద్ధికి ప్రతి ఒక్క అమెరికన్‌ చేయూతనివ్వాలని నూతన అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. అమెరికన్లందరికీ తాను అధ్యక్షుడిగా ఉంటానని హామీ ఇచ్చారు. దేశీయ ఉగ్రవాదంపై తప్పనిసరిగా విజయం సాధిస్తామని.. శ్వేత వర్ణ అహంకారాన్ని తప్పకుండా ఓడిస్తామని ఉద్ఘాటించారు. కరోనా వల్ల లక్షల ఉద్యోగాలు పోయాయని, ఆర్థిక రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి కషష్టకాలంలో మన శక్తియుక్తులన్నీ ప్రోది చేసుకుని ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని బైడెన్‌ చెప్పుకొచ్చారు. అందుకు ఐకమత్యంతో.. కలిసి ముందుకెళ్లాల్సి ఉందని అన్నారు.

  • 20 Jan 2021 11:41 PM (IST)

    ప్రజాస్వామ్యం అత్యంత విలువైందని అమెరికా నమ్మింది..

    అమెరికాలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని నూతన అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా ఎన్నో సవాళ్లను అధిగమించిందని అన్నారు. ప్రజాస్వామ్యం అత్యంత విలువైందని అమెరికా నమ్మిందని.. అలాంటి అమెరికా పార్లమెంట్‌ భవనంపై ఇటీవల దాడి జరగడం దురదృష్టకరం అంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను పరోక్షంగా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అమెరికాను అన్ని విధాలా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో తన ప్రమాణం చరిత్రాత్మక ఘటన అని, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ప్రమాణం చేయడం అమెరికాకే గర్వకారణం బైడెన్‌ అన్నారు.

  • 20 Jan 2021 11:37 PM (IST)

    అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ తొలి పలుకులు..‌

    అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌ తన తొలి ప్రసంగంలో చాలా కీలక అంశాలను టచ్ చేశారు. అమెరికాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని అన్నారు. అందుకు ప్రజలందరి సహకారం కావాలని అధ్యక్షుడు బైడెన్ కోరుకున్నారు. ఇటీవల పార్లమెంట్‌ భవనంపై జరిగిన దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఆయన.. ఇవాళ ప్రజాస్వామ్యం గెలిచిందని పరోక్షంగా ట్రంప్‌ పాలనను దుయ్యబట్టారు.

    అదే సమయంలో తాను అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటానంటూ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు అమెరికా 46వ అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణం చేసిన ఆయన అనంతరం జాతినుద్దేశించి కీలక ప్రసంగించారు.

  • 20 Jan 2021 11:11 PM (IST)

    అమ్మా… ఇదంతా నీ చలువే..

    అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేసే ముందు కమలా హారిస్ తన తల్లికి ట్విట్టర్​వేదికగా గుర్తుచేసుకున్నారు. తాను ఈ స్థితికి చేరడానికి కారణం తన తల్లి అని వీడియో ట్వీట్​లో పేర్కొన్నారు.

  • 20 Jan 2021 11:08 PM (IST)

    అమెరికా కొత్త అధ్యక్షుడికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు..

    అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన జో బైడెన్​కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్​-అమెరికా మైత్రిని దృఢపరిచేందుకు బైడెన్​తో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నట్టు ట్వీట్​ చేశారు మోదీ.

  • 20 Jan 2021 10:57 PM (IST)

    ప్రమాణ స్వీకారం అనంతరం జో బైడెన్ మాట్లాడుతూ..

    ప్రమాణ స్వీకారం అనంతరం జో బైడెన్ మాట్లాడుతూ.. అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని అన్నారు. ఇది అమెరికా ప్రజలందరి విజయమని చెప్పారు. ముందు ముందు సాధించాల్సింది చాలా ఉందని అన్నారు. క్యాపిటల్ హిల్ హింసతో అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని అందరూ భయపడ్డారని, అమెరికాలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని జో బైడెన్ పేర్కొన్నారు.

  • 20 Jan 2021 10:48 PM (IST)

    బైడెన్ ప్రమాణస్వీకారోత్సవ వేళ.. లేడీ గాగా పాట… జెన్నిఫర్‌ ఆట

    కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం తర్వాత హాలీవుడ్ దిగ్గజ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ‘అమెరికా ది బ్యూటిఫుల్’ అనే పాటను పాడి అందరిని ఆకట్టుకున్నారు.

  • 20 Jan 2021 10:46 PM (IST)

    ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్​ ప్రమాణస్వీకారం

    బైడెన్ ప్రమాణ స్వీకారం చేసే కొద్ది నిమిషాల ముందే ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. బైడెన్- కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

  • 20 Jan 2021 10:27 PM (IST)

    అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా జో బైడన్​ ప్రమాణం

    అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడన్​ ప్రమాణం..

Follow us