Free Condoms: ఐదో తరగతి ఆపై విద్యార్థులకు కండోమ్స్ తప్పనిసరి.. సంచలన నిర్ణయం తీసుకున్న పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్. ఎక్కడో తెలుసా?
5వ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో కండోమ్‌లు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేయాలని ఆదేశించింది పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ విభాగం.
అమెరికాలో పెద్ద చర్చ మొదలైంది. షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ (CPS) బోర్డు తీసుకున్న సంచలన నిర్ణయం ఇందుకు కారణంగా మారింది. 5వ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో కండోమ్‌లు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేయాలని నిర్ణయించింది. ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ నిబంధన ఆ బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తించనుంది. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు CPS బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
సెక్స్ ఎడ్యుకేషన్ కోసం…
2020 డిసెంబర్లోనే CPS బోర్డు ఈ విధానాన్ని రూపొందించింది. సెక్స్ ఎడ్యుకేషన్‌లో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నది బోర్డు నిర్ణయించింది. ఇక నుంచి ఎలిమెంటరీ స్కూళ్లలో 250, హైస్కూళ్లలో 1000 వరకు కండోమ్‌లు రెడీగా ఉంచాలని… ఇందు కోసం షికాగో ఆరోగ్యశాఖ సహకారంతో కండోమ్‌లను సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. కండోమ్స్ అందించడమే కాకుండా.. విద్యార్థులకు శరీర నిర్మాణ శాస్త్రం, కౌమార యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, లైంగిక ధోరణులు, లైంగిక ఆరోగ్యం వంటి అంశాలను తప్పని సరిగా క్లాసు రూమ్‌లో బోధించనున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసే తల్లిదండ్రులు బోర్డుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కూడా CPS కల్పించింది.
సమర్థిస్తున్న వైద్యులు…
ఈ నిర్ణయంపై CPS తీసుకున్న నిర్ణయాన్ని ఆ బోర్డు వైద్యుడు సమర్థించాడు. ఆరోగ్యపరంగా సరైన నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికైనా ఉందని… నిర్ణయాలకు తగ్గట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు వారికి సరిపడా వనరులు కావాలన్నారు. కండోమ్‌లు కావాలనుకున్నప్పుడు అవి అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అనుకుంటున్నామని వెల్లడించారు. ఇవి అందుబాటులో లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక సంక్రమణ వ్యాధులు, అవాంఛిత గర్భాలు వస్తాయని అన్నారు. అలా కాకుండా చూసుకోవడం కోసమే ఈ చర్యలని పేర్కొన్నారు.
తల్లిదండ్రుల ఆందోళన…
ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్ ఇవ్వాలన్న విధానాన్ని చాలామంది తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అసలు పిల్లలకు కండోమ్స్ ఇవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చిందని మండిపడుతున్నారు. తమ విధానాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. CPS తీసుకున్న నిర్ణయంపై త్వరలో కోర్టుకు కూడా వెళ్తామని తెలిపారు. ఇలాంటి చోట అమ్మాయిలను చదవించడం సరికాదన్నారు. రక్షణ లేని చోటికి అమ్మాయిలను ఎలా పంపిస్తామని ప్రశ్నించారు.