తల్లిదండ్రులు, సోదర, సోదరీమణులు.. చివరికి కడుపున పిల్లలు కంటే కూడా భార్యాభర్తల సంబంధం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ బంధం రక్త సంబంధంతో ఏర్పడని సంబంధం.. అయినా అత్యంత గొప్ప బంధం. అయితే ఈ సంబంధం జీవితాంతం నిలబడాలంటే.. ప్రేమపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రేమ లేకపోతే, సంబంధాన్ని విచ్ఛిన్నం అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. అయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే కానీ ఒక్కోసారి కోపం ఎక్కువై.. ఈ గొడవలు కూడా విషమ పరిస్థితికి తీసుకుని వెళ్తాయి. ఒకొక్కసారి.. మృత్యువు వరకూ చేరుస్తుంది ఈ బంధం.. ప్రస్తుతం అలాంటి ఒక విచిత్రమైన కేసు చర్చనీయాంశంగా మారింది.. ఒక వ్యక్తి తన భార్యను చంపడానికి ప్రయత్నించాడు. భార్య చేతులు, కాళ్లు కట్టేసి సజీవంగా భూమిలో పాతిపెట్టాడు. భార్య 4 గంటల పాటు పోరాడి.. ప్రాణాలతో ఆ జీవ సమాధి నుంచి బయటకు వచ్చింది.
డైలీ మెయిల్ కథనం ప్రకారం.. ఈ దారుణ ఘటన అమెరికాలోని వాషింగ్టన్‌లో చోటు చేసుకుంది. యాంగ్ సూక్ ఆన్ ( 42) చాయ్ క్యోంగ్ ఆన్ (53 ఏళ్లు ) దంపతులు చాలా కాలంగా ఆస్తికోసం గొడవలు పడుతున్నారు. అంతేకాదు ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆస్థి తనకు దక్కడం లేదనే కోపంతో ఒక రోజు యాంగ్ సూక్ భర్త చాయ్ క్యోంగ్ ..ఆమె ఇంటి వద్దకు వచ్చి.. ఆమెను కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించాడు.
జీవ సమాధి చేసిన భర్త:
నివేదికల ప్రకారం.. అక్టోబర్ 16 న.. తన భర్త దాడి చేసి.. చేతులు, కాళ్ళు కట్టి కారు డిక్కీలో పెట్టాడని యాంగ్ సూక్ ఆరోపించింది. అనంతరం తనను ఓ అడవిలోకి తీసుకెళ్లి అక్కడకు వెళ్లి.. సమాధిని తవ్వి.. అందులో తనను తోసి పైనుంచి మట్టితో కప్పినట్లు పేర్కొంది. అయితే తనకు ఓ ఉపాయం తట్టి.. సమాధి నుంచి ముక్కు కొంచెం బయటకు పెట్టి.. శ్వాస పీల్చుకున్నట్లు పేర్కొంది. తర్వాత తన ఆపిల్ వాచ్ నుంచి ముందుగానే ఎమెర్జెన్సీ నోటిఫికేషన్ పెట్టినట్లు.. దీని ఆధారంగా ఆపిల్ వాచ్‌తో 911కి కాల్ చేయగలిగానని తెలిపింది యాంగ్ సూక్ ఆన్.
తన సమాధిని తానే తవ్వుకుంటూ బయటకు వచ్చిన యాంగ్ సూక్ ఆన్
దాదాపు 3-4 గంటల పాటు సమాధిలో పడుకోవలసి వచ్చిందని యాంగ్ చెప్పింది. తరువాత తాను నెమ్మదిగా సమాధి నుండి మట్టిని తవ్వి బయటకు వచ్చి.. అడవి నుంచి బయటకు వచ్చి సమీపంలోని ఓ ఇంటికి వెళ్లినట్లు పేర్కొంది. అక్కడ నుండి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసుల బృందం ఆమెను రక్షించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మర్నాడు.. అంటే అక్టోబర్ 17న, ఆమె భర్తను అరెస్టు చేశారు. అతనిపై హత్యాయత్నం, గృహ హింస కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు ముంగిట ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..