UK Prime Minister: బ్రిటన్ ప్రధాని రేసులోకి రిషి సునాక్.. 128మంది ఎంపీల మద్ధతు.. ఈసారి త్రిముఖ పోరు తప్పదా?
అనుకున్నట్టుగానే రిషి సునాక్ మరోసారి బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా నిలబడేదెవరు? బ్రిటన్‌కు కాబోయే ప్రధాని ఎవరు? అనేది ఆసక్తిగా మారింది. బ్రిటన్ ప్రధాని పదవికి సిద్ధంగా..

అనుకున్నట్టుగానే రిషి సునాక్ మరోసారి బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా నిలబడేదెవరు? బ్రిటన్‌కు కాబోయే ప్రధాని ఎవరు? అనేది ఆసక్తిగా మారింది. బ్రిటన్ ప్రధాని పదవికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు రిషి సునాక్. పోటీ నుంచి తప్పుకోవాలని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచనను.. ఏమాత్రం పట్టించుకోకుండా.. బరిలో నిలుస్తున్నట్లు మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ట్వీట్ చేశారు. అంతే కాదు అధికార కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా పోటీ పడుతున్నట్లు తెలిపారాయన. గొప్పదేశమైన యునైటెడ్ కింగ్‌డమ్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందని రిషి సునాక్ చెప్పారు. గతానికంటే మెరుగ్గా భావితరాలకు అవకాశాలు కల్పించే దిశగా తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం ఉందన్నారు.
దేశ ఆర్థిక సమస్యల పరిష్కారంతో పాటు దేశ ప్రజలకు పార్టీ ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడానికి తాను ప్రధాని పదవికి, పార్టీ నాయకత్వ స్థానానికి పోటీలో ఉంటున్నట్లు ట్వీట్ చేశారు. బ్రిటన్‌లో ప్రధాని పదవి బరిలో నిలవాలంటే 100 మంది టోరీ పార్టీ ఎంపీల మద్దతు అవసరం. తమకు 128 మంది ఎంపీల మద్దతు ఉందని రిషి సునాక్ క్యాంప్ ప్రకటించింది. ఇక మరో మాజీ మంత్రి పెన్నీ మోర్డాంట్ కూడా ప్రధాని ఎన్నిక బరిలో నిలుస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అయితే ఆమెకు కేవలం 20 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉన్నట్టు సమాచారం.
ఇక మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే బ్రిటన్ ప్రధాని పదవికి జరిగే ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారనేది ఆసక్తిగా మారింది. రిషి సునాక్ మాత్రం గెలుపు మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. గత హామీలను నెరవేర్చిన రికార్డు తనకు ఉందనీ.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్ధికేతర సమస్యల పరిష్కారానికి తన దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉందంటున్నారు రిషి సునాక్.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
