Mohammed bin Salman : భారత పర్యటనకు సౌదీ యువరాజు.. చమురు ఉత్పత్తులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..
సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో భారత్ పర్యటనకు రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ లో పర్యటించనున్నారు. ఇండోనేషియాలో నవంబర్ నెలలో జరగనున్న..

సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో భారత్ పర్యటనకు రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ లో పర్యటించనున్నారు. ఇండోనేషియాలో నవంబర్ నెలలో జరగనున్న G-20 శిఖరాగ్ర సమావేశానికి వెళ్తూ ఢిల్లీకి రానున్నారు సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమవుతారు. నవంబర్ 15-16 తేదీల్లో జరిగే G-20 శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సౌదీ అరేబియా యువరాజు హాజరుకానున్నారు. ఈ సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు అంటే నవంబర్ 14వ తేదీన మొహమ్మద్ బిన్ సల్మాన్ ఢిల్లీ చేరుకుని, కొద్ది గంటల పాటు భారత పర్యటనలో ఉండనున్నారు. ద్వైపాక్షిక చర్చల కోసం ఈ ఏడాది సెప్టెంబరులో రియాద్‌ను సందర్శించిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. సౌదీ అరేబియా యువరాజును కలిసి భారత్ లో పర్యటించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానించినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా తమ దేశాన్ని సందర్శించాలని ఎస్.జై శంకర్ కోరారు.
ఈ ఇద్దరు నేతల సమావేశంలో ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రభావం, ఇంధన భద్రతపై చర్చించే అవకాశాలున్నాయి.సౌదీ అరేబియా యువరాజు పర్యటన భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. ఇరు దేశాల మధ్య గతంలో జరిగిన అవగాహన ఒప్పందాల్లో భాగంగా వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించే అవకాశం ఉంది.
సౌదీ అరేబియా యువరాజు పర్యటన కారణంగా నవంబర్ 10-13వ తేదీ మధ్య జరిగే ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సుతో పాటు తూర్పు ఆసియా సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలు తక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..