China: మరో కంత్రీ కుట్రకు తెరలేపిన ‘డ్రాగన్’.. లడఖ్ సమీపంలో 6 హెలి స్ట్రిప్‌ల నిర్మాణం
చైనా మరోసారి సరిహద్దు వెంబడి కుట్రలు మొదలుపెట్టింది. లడఖ్ సరిహద్దులో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)లో చైనా సైన్యం ఆరు కొత్త హెలిస్ట్రిప్‌లను నిర్మించింది. శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది.
చైనా మరోసారి సరిహద్దు వెంబడి కుట్రలు మొదలుపెట్టింది. లడఖ్ సరిహద్దులో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)లో చైనా సైన్యం ఆరు కొత్త హెలిస్ట్రిప్‌లను నిర్మించింది. శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. హెలిస్ట్రిప్ నిర్మించిన ప్రదేశం పశ్చిమ టిబెట్‌లో ఉంది. లడఖ్‌లోని డెమ్‌చోక్ నుండి ఈ హెలిస్ట్రిప్‌ల దూరం 100 మైళ్లు మాత్రమే. దీని కారణంగా ప్రమాదం మరింత పెరుగుతుందని రక్షణ వర్గా భావిస్తున్నాయి. ప్రస్తుతానికి, ఈ అంశంపై భారత ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు.
హెలి స్ట్రిప్‌ను గెయాయి అనే ప్రదేశంలో నిర్మించారు. ఇక్కడ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. హెలి స్ట్రిప్ నిర్మాణం ఏప్రిల్ 2024లో ప్రారంభమైంది. ఇక్కడ ఆరు హెలిస్ట్రిప్‌లను సిద్ధం చేస్తున్నట్లు చిత్రాలు చూపిస్తున్నాయి. అంటే ఒకటి రెండు హెలికాప్టర్లు మాత్రమే కాదు, అర డజను నుండి డజను వరకు హెలికాప్టర్లను ఏకకాలంలో ఇక్కడ మోహరించవచ్చు. ఇది లడఖ్‌లోని డెమ్‌చోక్‌కు కేవలం 100 మైళ్ల దూరంలో, ఉత్తరాఖండ్‌లోని బరాహోటీకి 120 మైళ్ల దూరంలో ఉంది. డెమ్‌చోక్ భారతదేశం -చైనా సైన్యాల మధ్య ఉద్రిక్త ప్రాంతంగా ఉంది.
చైనా సైన్యం తరచుగా LAC సమీపంలో హెలిప్యాడ్‌లు లేదా నిర్మాణాలను నిర్మిస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో అనేక రహదారులను కూడా నిర్మించింది. లడఖ్‌కు ఆనుకుని ఉన్న చైనా ప్రాంతంపై భారత్ కూడా నిఘా పెంచింది. ఇది మాత్రమే కాదు, 2020 లో గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ తర్వాత, భారతదేశం ఇక్కడ దళాల మోహరింపును కూడా పెంచింది. అదే సమయంలో, చైనాను ఎదుర్కోవటానికి వీలుగా, బలమైన రోడ్ల నెట్‌వర్క్‌ను వేయడం కూడా ప్రారంభించింది. భారత్ కూడా అనేక ఆధునిక ఆయుధాలను ఇక్కడ మోహరించింది.
చైనా దుశ్చర్యలు తొలిసారిగా బయటపడ్డాయని కాదు. జూలైలో, తూర్పు లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సు సమీపంలో చైనా సైన్యం తవ్వకాలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. చైనా ఇక్కడ ఒక భూగర్భ బంకర్‌ను నిర్మిస్తోంది. తద్వారా ఆయుధాలు, ఇంధనం, వాహనాలను నిల్వ చేయడానికి బలమైన ఆశ్రయం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది శాటిలైట్ ఛాయాచిత్రాల ద్వారా ఈ రహస్యం బట్టబయలైంది. బంకర్ నిర్మిస్తున్న ప్రాంతం మే 2020 నుండి ఖాళీగా ఉంది.
ఈ ప్రాంతంలో చైనాకు సిర్జాప్ స్థావరం ఉంది. ఇక్కడ పాంగోంగ్ సరస్సు చుట్టూ మోహరించిన చైనా సైనికులకు బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సిర్జాప్ బేస్ నిర్మాణ పనులు 2021-22లో జరిగాయి. ఆయుధాలను భద్రపరిచేందుకు ఇక్కడ భూగర్భ బంకర్‌ను నిర్మించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..