AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Subhanshu Shukla: శుభాంశు శుక్లా బృందానికి క్వారంటైన్‌… వారం రోజుల పాటు ఇస్రో వైద్యుల పర్యవేక్షణలో వ్యోమగాములు

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందానికి క్వారంటైన్‌ విధించారు. అంతర్జాతీయ అతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములకు వారం రోజుల పాటు క్వారంటైన్‌ విధించారు. ల్యాండింగ్ తర్వాత భూ వాతావరణానికి వారి శరీరాలు అలవాటుపడేందుకు వీలుగా వైద్యాధికారుల పర్యవేక్షణలో సుమారు 7 రోజులు క్వారంటైన్‌లో...

Subhanshu Shukla: శుభాంశు శుక్లా బృందానికి క్వారంటైన్‌... వారం రోజుల పాటు ఇస్రో వైద్యుల పర్యవేక్షణలో వ్యోమగాములు
Shubhanshu Shukla
K Sammaiah
|

Updated on: Jul 16, 2025 | 7:01 AM

Share

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందానికి క్వారంటైన్‌ విధించారు. అంతర్జాతీయ అతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములకు వారం రోజుల పాటు క్వారంటైన్‌ విధించారు. ల్యాండింగ్ తర్వాత భూ వాతావరణానికి వారి శరీరాలు అలవాటుపడేందుకు వీలుగా వైద్యాధికారుల పర్యవేక్షణలో సుమారు 7 రోజులు క్వారంటైన్‌లో ఉంచుతారు. వారం రోజుల పాటు ఇస్రో వైద్యులు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ నిరంతరం పర్యవేక్షిస్తారు.స్పేస్‌సెంటర్‌లో 18 రోజులు ఉన్న శుక్లా బృందం భారత కీర్తిపతాకను ఎగరేసి నేలకు సగర్వంగా తిరిగొచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.

జూన్ 25న మరో ముగ్గురితో కలిసి ISS వెళ్లింది శుభాంశు టీమ్‌. ISSలోని సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. పరస్పర కౌగిలింతలతో వాతావరణం ఉద్వేగభరితంగా మారింది. కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో శుభాంశు టీమ్‌ ల్యాండ్‌ అవ్వగానే భారతదేశంలోనూ భావోద్వేగంతో అందరి కళ్లు చెమ్మగిల్లాయి. భూమి నుంచి ISS వరకు 96.5 లక్షల కిలో మీటర్లు శుభాంశు ప్రయాణించారు. 230 సూర్యోదయాలతో పాటు 230 నక్షత్రాలను శుభాంశు అండ్ టీమ్‌ చూసింది. మరెన్నో సౌరకుటుంబాలను చూస్తూ అంతరిక్ష ప్రయాణం సాగింది. 18 రోజుల పాటు ISSలో ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు జరిపారు శుభాంశు అండ్‌ టీమ్. మొత్తం 60 ప్రయోగాలు చేయగా… 7 ప్రయోగాల్లో పాల్గొన్నారు శుభాంశు శుక్లా. నాసా నిర్వహించిన 5 జాయింట్ స్టడీస్‌లోనూ శుక్లా ఉన్నారు.

అంతరిక్షంలో మానవ ఆరోగ్య నిర్వహణపై ప్రయోగాలు జరిపింది శుక్లా బృందం. డయాబెటిక్ నియంత్రణ, క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలను అన్వేషించారు. మైక్రోగ్రావిటీలో రోగనిరోధక వ్యవస్థపై అధ్యయనం చేశారు. మొక్కల పెరుగుదలపై మైక్రోగ్రావిటీ ప్రభావాన్నిఅంచనా వేశారు. సూక్ష్మజీవులైన వాటర్ బేర్స్‌పై ప్రయోగాలు నిర్వహించారు. జీవనాధార వ్యవస్థలు, పోషకాహారం సంబంధిత అధ్యయనాల్లోనూ పాల్గొన్నారు శుభాంశు.

ఇక యావత్‌ భారతం శుభాంశుకు ఘనస్వాగతం పలికింది. ఇటు శుభాన్షు శుక్లాపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. తన అంకితభావం, ధైర్యంతో బిలియన్ల కలలను శుభాంశు ప్రేరేపించారని అన్నారు. శుభాంశును చూసి యావత్‌ భారతం గర్విస్తోందన్నారు. ఇక ఏడు రోజుల క్వారంటైన్‌ తర్వాత శుభాంశు తన కుటుంబ సభ్యులను కలుస్తారు.