Covid-19: గాలి ద్వారా కరోనా వైరస్‌.. అధ్యయనం ద్వారా సంచలన విషయాలు బయటపెట్టిన లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌

Covid-19: గాలి ద్వారా కరోనా వైరస్‌.. అధ్యయనం ద్వారా సంచలన విషయాలు బయటపెట్టిన లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌
Covid 19

Coronvirus: ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. అయితే కరోనా వైరస్‌పై రోజురోజుకు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. రకరకాలుగా రూపాంతరం చెం...

Subhash Goud

| Edited By: Ram Naramaneni

Apr 18, 2021 | 8:17 AM

Coronvirus: ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. అయితే కరోనా వైరస్‌పై రోజురోజుకు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. రకరకాలుగా రూపాంతరం చెందుతూ వ్యాపిస్తున్న కరోనా.. ఎందరినో బలిగొంది. ఇక కరోనా రోగులు దగ్గడం, తమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారానే వైరస్‌ ఇతరులకు వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా నిపుణులు సైతం ఇప్పటి వరకు వెల్లడిస్తూనే ఉన్నారు. అయితే, గాలి ద్వారాను వ్యాప్తిని కొట్టిపారేయలేమని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. గాలి ద్వారా కోవిడ్ వ్యాపిస్తుందని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేవని ఇప్పటి వరకూ చెబుతుండగా, తాజాగా లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో ఓ అధ్యయనం ద్వారా సంచలన విషయాలు వెల్లడించింది. గాలి ద్వారా కోవిడ్‌ వ్యాప్తి చెందుతున్నట్లు బలమైన ఆధారాలు ఉన్నాయి తేల్చి చెప్పింది.

అమెరికా, బ్రిటన్‌, కెనడాలకు చెందిన ఆరుగురు నిపుణులు చేపట్టిన ఈ అధ్యయనంలో గాలి ద్వారా కరోనా వ్యాప్తికి స్థిరమైన, బలమైన ఆధారాలు లభించాయని స్పష్టం చేశారు. ప్రధానంగా వైరస్‌ గాలి ద్వారా వ్యాపించదనే అలసత్వం వల్ల ప్రజారోగ్య చర్యలు విఫలమై కోవిడ్‌ వ్యాప్తికి కారణమవుతాయని కొలరోడో బౌల్డర్‌ యూనివర్సిటీ పరిశోధకుడు తెలిపారు.‘గాలి ద్వారా వ్యాప్తికి ఆధారాలు బలంగా ఉన్నాయి.. పెద్ద తుంపర్లు వ్యాప్తికి కారణం అవుతున్నాయని అనడానికి సాక్ష్యాలు లేవు’ అని పరిశోధనలో పాల్గొన్న కెమిస్ట్ జోసే లూయిజ్ జిమాంజే వెల్లడించారు.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన..

కాగా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ట్రిష్‌, గ్రీన్హాల్గ్‌ నేతృత్వంలో నిపుణుల బృందం ఈ అధ్యయనాన్ని సమీక్షించింది. గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తికి 10 రకాల ఆధారాలను గుర్తించినట్లు వెల్లడించింది. స్కగిట్ కోయిర్ వ్యాప్తి వంటి సూపర్ స్ప్రెడర్ ఘటనలు ఇందులో అగ్రస్థానంలో ఉన్నాయని బృందం తెలిపింది. ఒక బాధితుడు ద్వారా 53 మందికి వైరస్ సోకగా.. వీరంతా అతడితో కాంటాక్ట్ కాకుండానే వైరస్ బారిపడ్డారు.

మూసివున్న గదుల్లో 20 అడుగుల మేర వైరస్ విస్తరణ

అంతేకాదు.. SARS-CoV-2 వ్యాప్తి రేటు ఆరుబయట కంటే ఇంటి లోపల చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఎటువంటి కరోనా లక్షణాలు బయట పడని వ్యక్తుల ద్వారా కనీసం 40 శాతం మేర వైరస్‌ వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి చెందడంతో ఈ కేసులే కీలకంగా వ్యవహరించాయి. అయితే గాలిలో వ్యాప్తిచెందిన వైరస్ కణాలను పీల్చడం వల్ల సోకుతుంది. ఒక వైరస్ ప్రధానంగా గాలిలో ఉంటే, ఎవరైనా ఊపిరి పీల్చుకున్నప్పుడు, మాట్లాడేటప్పుడు, అరవడం, పాడటం లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా సంక్రమించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే వైరస్‌ మూసివున్న గదుల్లో 20 అడుగుల్లో విస్తరించనున్నట్లు లాన్సెట్‌ అధ్యయనంలో తేలింది. అలాగే రోగి చుట్టు మూడు మీటర్ల వరకూ వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.

అప్రమత్తంగా ఉండాలి

దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలు లేని అసింప్టమాటిక్‌ వ్యక్తుల నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రద్దీ లేకుండా చూసుకోవడం, గదులలో గడిపే సమయాన్ని తగ్గించుకోవడం వంటి చర్యల ద్వారా గాలిలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. మాస్కులు ధరించడం వల్ల వైరస్‌ను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి పాటించడం ఎంతో ముఖ్యమన్నారు.

ఇవీ చదవండి: Covid-19: తెలంగాణ ప్రభుత్వానికి సవాలుగా మారిన పండగలు… కేసులు పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలు

Coronavirus: కరోనా వైరస్ వ్యాప్తి.. సంచలన విషయాలు వెల్లడించిన సీసీబీఎం సీఈఓ మధుసూదన రావు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu