Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka Crisis: వారం రోజుల్లో శ్రీలంకకు కొత్త ప్రధాన మంత్రి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అధ్యక్షుడు గోటబయ

శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆయన చెప్పారు.

Sri Lanka Crisis: వారం రోజుల్లో శ్రీలంకకు కొత్త ప్రధాన మంత్రి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అధ్యక్షుడు గోటబయ
Gotabaya Rajapaksa
Follow us
Balaraju Goud

|

Updated on: May 11, 2022 | 9:51 PM

Sri Lanka Crisis: శ్రీలంకలో గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభంతో అల్లాడుతోంది. కొంతకాలంగా వేల మంది ప్రజల నిరసన హోరుకు ఎట్టకేలకు దిగొచ్చిన ఆ దేశ అధ్యక్షులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హింసాత్మక నిరసనల మధ్య శ్రీలంకలో కర్ఫ్యూ కొనసాగుతోంది. హింసకు పాల్పడినవారికి కాల్చడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. కాగా, ఈ నేపథ్యంలో తాజాగా శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆయన చెప్పారు. మరో వారం రోజుల్లో కొత్త ప్రధానిని నియమించి మంత్రివర్గాన్ని ఎన్నుకుంటామని వెల్లడించారు.

ఎవరికి మెజారిటీ ఉంటే వారి ప్రభుత్వమే ఏర్పాటు చేస్తామని అధ్యక్షుడు గోటబయ స్పష్టం చేశారు. దీంతో పాటు కేబినెట్‌ మంత్రులను కూడా ఎంపిక చేయనున్నారు. దేశంలో దిగజారుతున్న పరిస్థితులకు సంబంధించి, హింసకు పాల్పడవద్దని, నిరసనలు ఆపవద్దని రాష్ట్రపతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదిలావుంటే, గత సోమవారం శ్రీలంక ప్రధానమంత్రి రాజపక్స తన పదవికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. రాజపక్సే కుటుంబం అవినీతితో లంకను తీవ్ర అప్పుల్లో ముంచేసిందంటూ ప్రతిపక్షాలు, ప్రజాస్వామికవాదుల నిరసన గళం వినిపిస్తున్నా.. రాజీనామాకు ససేమిరా అంటూ వచ్చిన మహీంద రాజపక్స ఎట్టకేలకు తన రాజీనామా లేఖను అధ్యక్షుడు గొటబాయకు పంపించారు.

అసలు సంక్షోభం మొదలైందిలా..

పర్యాటక దేశంగా పేరొందిన శ్రీలంకలో 2019లో ఈస్టర్‌ పండగ రోజు ఓ చర్చిలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన ఆ దేశ పర్యాటక రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. దీంతో విదేశీ మారక నిల్వలు పతనమయ్యాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో దిగుమతులపై నిషేధం విధించారు. ఫలితంగా చమురు, నిత్యావసరాల కొరత ఏర్పడి వాటి ధరలు ఆకాశాన్నంటాయి. తేయాకు, రబ్బరు, వస్త్రాలు వంటివి ఎగుమతి చేసే శ్రీలంకకు 2013లో ప్రపంచవ్యాప్తంగా కమొడిటీ ధరలు భారీగా పతనం కావడం కూడా కోలుకోలేకుండా దెబ్బ తీశాయి. వాస్తవానికి అప్పట్నుంచే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూడటం మొదలైందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.