AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీవ్‌పై 11 గంటల పాటు భారీ డ్రోన్, క్షిపణి దాడికి దిగిన రష్యా.. 21 మంది దుర్మరణం!

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా 11 గంటల పాటు కొనసాగించిన భారీ డ్రోన్, క్షిపణి దాడిలో దాదాపు 21 మంది పౌరులు మరణించగా, 90 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ ఇటీవల రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన కేంద్రాలపై వరుసగా జరిపిన సుదూర దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాడి సమయంలో కీవ్ నగరం వరుస పేలుళ్లతో దద్దరిల్లింది.

కీవ్‌పై 11 గంటల పాటు భారీ డ్రోన్, క్షిపణి దాడికి దిగిన రష్యా.. 21 మంది దుర్మరణం!
Russia Attacks Ukraine
Balaraju Goud
|

Updated on: Jul 03, 2026 | 7:22 AM

Share

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా 11 గంటల పాటు కొనసాగించిన భారీ డ్రోన్, క్షిపణి దాడిలో దాదాపు 21 మంది పౌరులు మరణించగా, 90 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ ఇటీవల రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన కేంద్రాలపై వరుసగా జరిపిన సుదూర దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాడి సమయంలో కీవ్ నగరం వరుస పేలుళ్లతో దద్దరిల్లగా, వైమానిక దాడి హెచ్చరికల నేపథ్యంలో 50 వేల మందికి పైగా ప్రజలు మెట్రో సబ్‌వే స్టేషన్లలో ఆశ్రయం పొందారు. అనేక నివాస భవనాలు ధ్వంసమవగా, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు రోజంతా గాలింపు చర్యలు కొనసాగించాయి.

ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటన ప్రకారం, రష్యా మొత్తం 74 క్షిపణులు, 496 డ్రోన్‌లను ప్రయోగించింది. వీటిలో గణనీయమైన సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ఉండటంతో వాటిని అడ్డుకోవడం కష్టమైందని అధికారులు తెలిపారు. కీవ్ నగరవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. డెస్నియాన్‌స్కీ, డార్నిట్‌స్కీ జిల్లాల్లో తొమ్మిది అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనాలు తీవ్రంగా దెబ్బతిని పలువురు చిక్కుకుపోయారు. మరోవైపు ద్నీప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంపై జరిగిన దాడిలో ఏడేళ్ల బాలిక మరణించగా, ఒకే కుటుంబానికి చెందిన మరో నలుగురు గాయపడ్డారు.

ఈ దాడులు కేవలం సైనిక స్థావరాలు, ఆయుధ కర్మాగారాలు, ఇంధన కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్నామని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. అయితే రష్యా వైమానిక దాడులు పదేపదే పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 16 వేల మందికి పైగా ఉక్రేనియన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ఇటీవలి వారాల్లో ఉక్రెయిన్ రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు, సరఫరా మార్గాలపై వరుస సుదూర దాడులు నిర్వహిస్తోంది. అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ దీనిని 40 రోజుల మెరుపుదాడిగా అభివర్ణించారు. ఈ దాడుల వల్ల రష్యాలో ఇంధన కొరత ఏర్పడటంతో పాటు యుద్ధ నిర్వహణపై ఒత్తిడి పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా క్రిమియాకు వెళ్లే సరఫరా మార్గాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా రష్యా సైనిక కార్యకలాపాలను నెమ్మదింపజేయాలన్న వ్యూహాన్ని ఉక్రెయిన్ అమలు చేస్తోంది.

ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం, మాస్కోకు తూర్పున ఉన్న నిజ్నీ నొవ్‌గోరోడ్ ప్రాంతంలోని రష్యా అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకదానిపై ఉక్రెయిన్ దళాలు విజయవంతంగా దాడి చేసి అగ్నికి ఆహుతి చేశాయి. అలాగే రష్యా ఆక్రమిత లుహాన్స్క్ ప్రాంతంలోని కీలక రైల్వే వంతెనను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించకపోగా, వచ్చే వారం టర్కీలో జరిగే నాటో శిఖరాగ్ర సమావేశంలో ఈ యుద్ధ పరిణామాలు ప్రధాన చర్చాంశంగా మారనున్నాయి. ఉక్రెయిన్ మాత్రం మరిన్ని పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థలు అందించాలని మిత్రదేశాలను మరోసారి కోరుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us