AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!

రష్యా–ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. శనివారం (జూలై 25) ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి భారీ డ్రోన్, క్షిపణి దాడులు జరపడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఆక్రమిత జపోరిజ్జియా ప్రాంతంలోని విహార శిబిరాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించారని మాస్కో ప్రకటించింది.

క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!
Russia Ukraine Attacks
Balaraju Goud
|

Updated on: Jul 26, 2026 | 8:59 AM

Share

రష్యా–ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. శనివారం (జూలై 25) ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి భారీ డ్రోన్, క్షిపణి దాడులు జరపడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఆక్రమిత జపోరిజ్జియా ప్రాంతంలోని విహార శిబిరాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించారని మాస్కో ప్రకటించింది. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు క్రెమ్లిన్ నియమించిన ప్రాంతీయ అధిపతి యెవ్జెనీ బాలిట్స్‌కీ తెలిపారు. మరో 19 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ వెంటనే స్పందించలేదు.

అదే సమయంలో ఉక్రెయిన్‌లోని ఈశాన్య సుమీ ప్రాంతంపై రష్యా జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు మరణించారు. పౌర సదుపాయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి అనంతరం భారీ అగ్నిప్రమాదం సంభవించిందని ప్రాంతీయ అధికారులు తెలిపారు. మృతులు ప్రైవేట్ పోస్టల్ సంస్థ “నోవా పోష్టా”లో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారేనని వెల్లడించారు. సుమీ ప్రాంతంలోని ఉక్రెయిన్ డ్రోన్ నిల్వ, ప్రయోగ కేంద్రాన్ని విజయవంతంగా ధ్వంసం చేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఇక ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియాలోని ఓ షాపింగ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్ దాడి చేయడంతో 500 చదరపు మీటర్ల మేర మంటలు వ్యాపించాయి. పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పశ్చిమ సైబీరియాలోని ట్యూమెన్ చమురు శుద్ధి కర్మాగారంతో పాటు యెకాటెరిన్‌బర్గ్‌లోని లాజిస్టిక్స్ కేంద్రం, రోస్టోవ్-ఆన్-డాన్‌లోని ఇంధన గిడ్డంగులపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడులను అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ధృవీకరించారు. ఉక్రెయిన్ సుదూర డ్రోన్ సామర్థ్యం గణనీయంగా పెరగడంతో రష్యా ఇంధన మౌలిక సదుపాయాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, రష్యా రాబోయే 48 గంటల్లో మరింత భారీ క్షిపణి దాడులకు సిద్ధమవుతోందని ఉక్రెయిన్ నిఘా సంస్థలు హెచ్చరించినట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జెలెన్‌స్కీ మంగళవారం వాషింగ్టన్‌లో సమావేశం కానున్నట్లు వైట్ హౌస్ అధికారి వెల్లడించారు. ఈ సమావేశంలో భద్రతా సహకారం, యుద్ధ పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.

ఇక ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో తమ గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్‌ను ఎఫ్-16 యుద్ధవిమానంతో కూల్చివేసినట్లు రొమేనియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో డ్రోన్‌ను కూల్చివేసిన ఘటనగా పేర్కొంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పొరుగు నాటో దేశాల భద్రతపైనా ప్రభావం చూపుతుండటంతో అంతర్జాతీయ ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. నిరంతర ప్రతిదాడులు కొనసాగుతుండటంతో దౌత్యపరమైన పరిష్కారంపై ఆశలు క్రమంగా తగ్గిపోతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us