AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త కంటే భార్య సంపాదన ఎక్కువ.. మధ్యంతర భరణంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భర్త కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న మహిళకు మధ్యంతర భరణం మంజూరు చేయడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది. విదేశాల్లో జీవన వ్యయం అధికంగా ఉండటాన్ని మాత్రమే మధ్యంతర భరణం మంజూరు చేయడానికి సరైన కారణంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.

భర్త కంటే భార్య సంపాదన ఎక్కువ.. మధ్యంతర భరణంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు..!
Bombay High Court
Balaraju Goud
|

Updated on: Jul 26, 2026 | 8:19 AM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భర్త కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న మహిళకు మధ్యంతర భరణం మంజూరు చేయడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది. అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తూ నెలకు 8,700 డాలర్లు (సుమారు రూ.8 లక్షలు ) సంపాదిస్తున్న మహిళ, తన భర్త నుంచి నెలకు రూ.1 లక్షల మధ్యంతర భరణం కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయమూర్తులు భారతి డాంగ్రే, మంజుషా దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.

విదేశాల్లో జీవన వ్యయం అధికంగా ఉండటాన్ని మాత్రమే మధ్యంతర భరణం మంజూరు చేయడానికి సరైన కారణంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ 2011 నుంచి అమెరికాలో నివసిస్తూ ఢిల్లీకి చెందిన ఐటీ సొల్యూషన్స్ సంస్థ మార్క్ ఇన్ఫోటెక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె భర్త కూడా ఐటీ రంగంలోనే పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో పెరుగుతున్న పోటీ, ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తుండటంతో భర్త ఉద్యోగ భద్రతపై భవిష్యత్తులో ప్రభావం పడే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

ఇప్పటికే కుటుంబ న్యాయస్థానం కూడా ఆమె మధ్యంతర భరణం అభ్యర్థనను తిరస్కరించింది. అయితే కేసు నిర్వహణ ఖర్చుల కోసం భర్త రూ.25 వేల చెల్లించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ మహిళ హైకోర్టును ఆశ్రయించినా, కుటుంబ న్యాయస్థానం నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా, పెద్ద బిడ్డ తండ్రి వద్ద, చిన్న బిడ్డ తల్లి సంరక్షణలో ఉన్నారు. ఈ తీర్పు ఆదాయ సామర్థ్యం, ఆర్థిక స్వావలంబన, ఉద్యోగ పరిస్థితులు వంటి అంశాల ఆధారంగా మధ్యంతర భరణం నిర్ణయించబడుతుందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us