Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SCO SUMMIT: చైనా, రష్యా అధ్యక్షులతో వేదిక పంచుకోనున్న ప్రధాని మోదీ.. ఎవరెవరితో ద్వైపాక్షిక సమావేశాలంటే..

SCO సదస్సులో పాల్గొంటున్న అగ్రనేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశాలున్నాయి. భారత్‌-పాక్‌, భారత్‌-చైనా నేతల మధ్య ఈ సందర్భంగా చర్చలకు అవకాశం ఉంటుందా అనే విషయమే ఆసక్తిగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

SCO SUMMIT: చైనా, రష్యా అధ్యక్షులతో వేదిక పంచుకోనున్న ప్రధాని మోదీ.. ఎవరెవరితో ద్వైపాక్షిక సమావేశాలంటే..
Modi, Pak Pm, China Preside
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 15, 2022 | 7:58 AM

SCO SUMMIT: ప్రపంచంలో కొన్ని కీలక దేశాల అధినేతలంతా ఒకచోటకు చేరారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో మరి కొద్ది గంటల్లో ప్రారంభంకానున్న షాంఘై సహకార సంస్థ(SCO) శిఖరాగ్ర సదస్సులో ఈనేతలంతా ఒకే వేదికపై కలుసుకోనున్నారు. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల తర్వాత షాంఘై సహకార సంస్థ లో సభ్య దేశాల నేతలు ముఖాముఖి సమావేశం కానుండడం ఇదే తొలిసారి. రెండు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు చర్చకు రానున్నాయి. 2001లో ప్రారంభమైన SCOలో చైనా, కజక్‌స్థాన్‌, కిర్గిజిస్థాన్‌, రష్యా, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, భారత్‌, పాకిస్థాన్‌లకు పూర్తిస్థాయి సభ్యత్వం ఉంది. భారత్‌, పాకిస్తాన్ 2017లో పూర్తిస్థాయి సభ్యులయ్యాయి. SCOలో పరిశీలక దేశాలుగా…ఆఫ్గానిస్థాన్‌, బెలారస్‌, మంగోలియా కొనసాగుతున్నాయి. కంబోడియా, నేపాల్‌, శ్రీలంక, తుర్కియే, ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లు చర్చల్లో భాగస్వామ్య హోదాను కలిగి ఉన్నాయి. ఈసమావేశాల్లో వివిధ అంశాలపై జరిగే చర్చలు ఒక ఎత్తైతే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏయే దేశాల అధినేతలతో ప్రత్యేకంగా సమావేశమై.. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారనేది ఆసక్తిగా మారింది. ఓవైపు భారత్, చైనా మధ్య సరిహద్దు ప్రాంతాల్లో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. అలాగే తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద పెట్రోలింగ్‌ పాయింట్‌-15 నుంచి భారత, చైనా బలగాలు వెనక్కి మళ్లిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కొంత వరకు సడలింది. ఈనేపథ్యంలో చైనా అధ్యక్షులు షీ జిన్ పింగ్ తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమవుతారా.. అయితే ఏయే అంశాలపై చర్చిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈఇద్దరి నేతల భేటీపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.

SCO సదస్సులో పాల్గొంటున్న అగ్రనేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశాలున్నాయి. భారత్‌-పాక్‌, భారత్‌-చైనా నేతల మధ్య ఈ సందర్భంగా చర్చలకు అవకాశం ఉంటుందా అనే విషయమే ఆసక్తిగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మధ్య చర్చలు జరుగుతాయని అధికారిక ప్రకటన వెలువడింది. వ్యూహాత్మక స్థిరత్వం, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులు, ఐక్యరాజ్య సమితి, జి-20లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం వంటి అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. డిసెంబరులో ఐరాస భద్రతా మండలికి, 2023లో జీ-20, SCOకు భారత్‌ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఎంతో కీలకం కానుంది. అలాగే ఇరాన్ అధినేతతోనూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ద్వైపాకిక సమావేశంలో పాల్గొననున్నారు.

SCO సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పాల్గొనడంపై నెలకొన్న సందేహాలు తొలగిపోయాయి. కజక్‌స్థాన్‌ పర్యటనలో ఉన్న షీ జిన్‌పింగ్‌ అటు నుంచి ఉజ్బెకిస్థాన్‌కు వస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఒకే వేదికను పంచుకోనుండడం ఈ శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కొవిడ్‌ విజృంభణ తర్వాత తొలిసారిగా అగ్రనేతలు నేరుగా ఒకేచోట కలుసుకోనున్నారు. 2020లో మాస్కోలో జరిగిన ఎస్‌సీవో సదస్సుకు నేతలందరూ వర్చువల్‌ విధానంలో హాజరయ్యారు. 2021లో దుషాంబే శిఖరాగ్ర సదస్సు వర్చువల్‌, భౌతిక హాజరు విధానంలో జరిగిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..