Panda Twins: చైనాలో పుట్టిన పాండా కవలలు.. అంతరించిపోతున్న జీవులకు ప్రాణం పోస్తున్న శాస్త్రవేత్తలు..
చైనీస్ పశువైద్యులు జంతువుల సంఖ్యను పెంచడానికి కొన్నేళ్లుగా కృత్రిమ గర్భధారణ పద్దతులను ఉపయోగిస్తున్నారు. ఇవి అడవిలో అరుదుగా పునరుత్పత్తి చేస్తాయి.
Panda Twins Born In China: పర్యావరణ కాలుష్యం మూలంగా ఎన్నో రకాల జీవులు అంతరించిపోతున్నాయి. ఆధునిక సాంకేతికత పెరగడం, గ్లోబల్ వార్మింగ్ లాంటి విషయాలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించినప్పటికీ.. ఫలితం ఎక్కువగా కనిపించడం లేదు. వాతావరణంలో వస్తున్న మార్పులతోపాటు.. వాయు, నీటి, ధ్వని కాలుష్యాల మూలంగా మనుషులతోపాటు జంతువులు కూడా చెడు ప్రభావానికి గురవుతున్నాయి. చాలా జంతువులు ఇప్పటికే అంతరించిపోయాయి. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు అంతరించిపోతున్న పాండాలపై అధ్యయనం చేసి.. కృత్రిమ గర్భధారణ (Artificial Insemination) పద్దతిలో రెండింటికి పురుడుపోశారు. నైరుతి చైనాలోని ఒక సంతానోత్పత్తి కేంద్రంలో రెండు కవల పాండాలు (మగ, ఆడ) జన్మించాయి. వాతావరణ మార్పు, ఆవాసాల నష్టం మధ్య మనుగడ కోసం పోరాడుతున్న చైనాలో ఇవి జన్మించడం.. దేశంలో పాండాల సంఖ్య పెరుగుదలకు సంకేతమని శాస్త్రవేత్తలు అభివర్ణించారు. చైనాలో అనధికారికంగా పాండాలను జాతీయ జంతువులుగా పరిగణిస్తారు. షాంగ్సీ ప్రావిన్స్‌లోని క్విన్లింగ్ పాండా రీసెర్చ్ సెంటర్‌లో మంగళవారం క్విన్ క్విన్ అనే పాండా కవలలు (ఆడ, మగ పిల్లలకు) జన్మనిచ్చినట్లు తెలిపారు. మరో పాండా యోంగ్ యోంగ్ కూడా ఈ నెల ప్రారంభంలో కవలలకు జన్మనిచ్చిందని కేంద్రం నిర్వాహకులు వెల్లడించారు. క్విన్ క్విన్ పాండా కూడా ఈ కేంద్రంలో జన్మించిందని.. గతంలో 2020లో కవల ఆడపిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు.
అయితే.. ఈ పాండా పిల్లలకు తండ్రి గురించి మాత్రం చైనా మీడియా వెల్లడించలేదు.కానీ చైనీస్ పశువైద్యులు జంతువుల సంఖ్యను పెంచడానికి కొన్నేళ్లుగా కృత్రిమ గర్భధారణ పద్దతులను ఉపయోగిస్తున్నారు. ఇవి అడవిలో అరుదుగా పునరుత్పత్తి చేస్తాయి. ఇవి పశ్చిమ చైనాలోని పర్వతాలలో వెదురు ఆహారంపై ఆధారపడతాయి. అందుకే వీటిని ల్యాబ్‌లలో రీసెర్చ్ చేసి పాండాల సంఖ్యను పెంచేందుకు చైనా శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. అంతరించి పోతున్న ఇతర జంతువులను సైతం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ పద్దతిలో చైనా శాస్త్రవేత్తలు పునరుత్పత్తి చేస్తున్నారు.
A Giant panda named Qin Qin has given birth to twin cubs at a breeding center in northwest China’s Shaanxi Province. https://t.co/mWSBcVZFTE pic.twitter.com/oQiaoS976I
— The Associated Press (@AP) August 24, 2022
ఇలా అభివృద్ధి చేసిన పాండాలను అడవిలోకి విడుదల చేయడంతో ఈ ప్రయత్నాలు మరింత ఫలించాయి. అడవి పాండాల జనాభా క్రమంగా పెరుగుతూ 1,800కి చేరుకుంది. ప్రస్తుతం దాదాపు 500 పాండాలు ఇతర జంతుప్రదర్శనశాలల్లో, రిజర్వ్‌లలో ఉన్నాయి. సిచువాన్‌లోని పర్వత పర్వత ప్రాంతాల్లోనే అడవిలో పాండాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులు, పరిశ్రమలు వాటి భూమిని ఆక్రమించడం వల్ల పాండాల స్థలం తగ్గిపోయింది. అదే సమయంలో వాటి సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుందని చైనా మీడియా తెలిపింది. మధ్య, పశ్చిమ చైనాలో వేసవి ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులు, కరువు కారణంగా అటవీ ప్రాంతం మొత్తం దెబ్బతింది.